ప్రధాని నరేంద్ర మోడీ విశాఖలో నేడు పర్యటించిన విషయం తెలిసిందే. అయితే.. అయితే.. ఈ పర్యటనలో భాగంగా నిన్న రాత్రి విశాఖకు చేరుకున్న మోడీ.. రాత్రి ఏపీ కోర్ కమిటీతో సమావేశమయ్యారు. అనంతరం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సైతం భేటీ అయ్యారు. అయితే.. ప్రస్తుతం విశాఖ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారం రిషికొండను పరిశీలించారు. శుక్రవారం ప్రధాని మోదీ, జనసేన నేతలతో భేటీలతోనే గడిపిన పవన్ కల్యాణ్… నగరంలో మరే కార్యక్రమం పెట్టుకోలేదు. తాజాగా ప్రధాని విశాఖను వీడిన తర్వాత విశాఖ పరిసర ప్రాంతాల పరిశీలనకు పవన్ బయలుదేరారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు యథేచ్ఛగా తవ్వేస్తున్నారంటూ టీడీపీ సహా వామపక్షాలు ఆరోపిస్తున్న రిషికొండను పరిశీలించేందుకు పవన్ వెళ్లారు. జనసేనకు చెందిన స్థానిక నేతలను కొందరిని వెంటేసుకుని రిషికొండ చేరుకున్న పవన్ కల్యాణ్… కొండపై జరుగుతున్న పనులేమిటన్న దానిపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా కొండపై పనులు జరుగుతున్న ప్రాంతాల్లో భారీ షీట్లతో బారీకేడ్లు ఏర్పాటు చేసి ఉండగా…వాటిని ముట్టుకోని పవన్.. ఆ బారీకేడ్లకు ఆనుకుని ఉన్న ఓ మట్టి గుట్టను ఎక్కి… బారీకేడ్ల ఆవలి వైపు ఏం జరుగుతోందన్న దానిని పరిశీలించారు. అంతకు ముందు రిషికొండ బీచ్‌లో పవన్ కళ్యాణ్ కాసేపు సరదాగా గడిపారు. పవన్‌తో పాటు పార్టీ పబ్లిక్ కమిటీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ కూడా బీచ్‌లో వాక్ చేశారు. అక్కడ కనిపించిన ఓ మత్స్యకారుడితో కాసేపు మాట్లాడారు. పవన్ రిషికొండలో ఉన్నారని తెలియడంతో ఆయన అభిమానులు చాలా మంది అక్కడికి చేరుకున్నారు. పవన్‌ని నేరుగా చూసేందుకు ఎగబడుతున్నారు.