ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతల ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని.. వాళ్లకు ఓటేయనివారు శత్రువులన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. మనవారు కానివారిని ‘తొక్కి నార తీయండి’ అనేలా ఏపీలో పాలన అని.. ఇప్పటం గ్రామం జనసేన సభకు భూమి ఇచ్చినందుకు ప్రభుత్వం కక్షతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు పవన్ కళ్యాణ్.
మార్చి 14వ తేదీన సభ జరిగితే.. ఆ తర్వాతే రోడ్డప విస్తరణ పేరుతో ప్రభుత్వం కక్ష సాధింపు ప్రక్రియను మొదలు పెట్టింది.వాళ్లకు ఓటేసిన 49.95 శాతం మందికే పాలకులం అన్నట్లుగా ఉందని తెలిపారు. ఇప్పటంలో రహదారి విస్తరణ పేరుతో జరుగుతోంది అరాచకమే… ఇప్పటికే 70 అడుగుల రోడ్దు ఉంటే ఇంకా విస్తరణేంటి? అని నిలదీశారు.
రహదారి విస్తరణ వంకతో ఇళ్లు తొలగిస్తున్నారని.. కూల్చివేత నోటీసులపై గ్రామస్థులు ఇప్పటికే కోర్టుకు వెళ్లారన్నారు. ఆగమేఘాల మీద ఇళ్ల కూల్చివేత చేపట్టారని.. వాహానాల రాకపోకలు ఎక్కువగా లేని గ్రామంలో ఇప్పటికే 70 అడుగుల రోడ్ ఉందని పేర్కొన్నారు. కక్షతో ఇళ్లని కూల్చేయడానికి 120 అడుగుల మేర రోడ్ విస్తరణ అంటూ కూల్చివేతలు మొదలెట్టారని ఫైర్ అయ్యారు పవన్ కళ్యాణ్.