‘‘కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని వదిలిపెట్టిపోయేంత వరకూ రాజకీయాలను పక్కన పెడదాం… చిల్లర రాజకీయాలకు దూరంగా ఉందాం.. ప్రజలను రక్షించుకోవడం, వారి సంక్షేమం, అవసరాలు, ఆకలిదప్పులు తీర్చడంపై మన శక్తియుక్తుల్ని కేంద్రీకరిద్దాం. ఇప్పటివరకు అయినది చాలు! ఈ సమయంలోనైనా రాజకీయాలు ఆపకపోతే ప్రజలు తిరగబడే పరిస్థితులు ఏర్పడే ప్రమాదం వుంది’’ అంటూ తాజాగా విడుదల చేసిన ప్రెస్ నోట్ లో పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు! అంతవరకూ బాగానే ఉంది కానీ… ఈ నోట్ లో పవన్ చెప్పిన అంశాలు అన్నీ తనదైన మార్కు రాజకీయాలు చేస్తూనే ఉన్నానయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకూ పవన్ తన ప్రెస్ నోట్ లో ఏమి చెప్పారు అనేది ఒకసారి విశ్లేషిద్దాం!
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నివారణపై కంటే రాజకీయ ప్రత్యర్థులపైనే “కొందరు అధికార పార్టీ పెద్దలు” దృష్టి పెడుతున్నారని పవన్ తెలిపారు! రోజు రోజుకీ బెంబేలెత్తిస్తున్న కరోనా కేసుల సమయంలో ఆంధ్రప్రదేశ్ లో తప్పులు వేలెత్తి చూపేవారిపై బురద చల్లే కార్యక్రమాన్ని”అధికార పార్టీ పెద్దలు” కొనసాగిస్తున్నారని విమర్శించారు! ఇదే సమయంలో… బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ విషయంపై కూడా స్పందించారు పవన్! ఎక్కడా విజయసాయి పేరు ప్రస్థావించకుండానే… కన్నా.. విషయంలో జరుగుతున్న వ్యక్తిగత విమర్శలను వ్యక్తిత్వహనన దాడిగా భావించి ప్రజాస్వామ్యవాదులు ఖండించవలసిన రీతిలో, “ఆయనకు క్షమాపణలు చెప్పాలని” అడిగే స్థాయిలో ఉందని పవన్ వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్ మొత్తం అధికారపార్టీ పెద్దలను కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగా, మరికొన్ని సందర్భాల్లో పరోక్షంగా విమర్శించేలా ఉందనే విశ్లేషణలు అప్పుడే సోషల్ మీడియా వేదికగా మొదలైపోయాయి! చిల్లర రాజకీయాలు వద్దంటూనే… ఒకవైపే స్టాండ్ తీసుకుని మాట్లాడారని, పెద్దన్నలా రెండు వైపులా మాట్లాడి ఉంటే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతుండగా… పార్టీలకు అతీతంగా మరింత బలమైన సూచనలు చేస్తూ, మరింత మోటివేషనల్ సలహాలు ఇస్తే బాగుండేదని పలువురు అభిమానులు కోరుకుంటున్నారు!
కాగా… ఈ కరోనా సమయంలో సమాజానికి సేవచేస్తున్నవారిలో అధికార వైకాపా తర్వాత స్థానంలో ఉన్నది టీడీపీ నో, బీజేపీ నో కాదు.. జనసేనే అని విశ్లేషకులు చెబుతున్నారు!