పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార వాహనం “వారాహి” ప్రత్యేకతలు ఇవే

-

పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార వాహనం “వారాహి” విశేషాలు వివరిస్తూ జనసేన పత్రికా ప్రకటన విడుదల చేసింది. వారాహి.. వాహనాన్ని ప్రత్యేక భద్రత చర్యలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దారు. పవన్ కళ్యాణ్ పర్యటనలు చేసిన సందర్భంలో విద్యుద్దీపాలు ఆర్పి వేసి కక్ష సాధింపు చర్యలకు దిగే సంస్కృతినీ చూస్తున్నాం.ఇటీవల విశాఖపట్నం పర్యటన సందర్భంలో వీధి దీపాలు ఆర్పివేసిన విషయం విదితమేనని స్పష్టం చేసింది జనసేన. వారాహి వాహనంపై ప్రత్యేక లైటింగ్ ఏర్పాట్లు ఉన్నాయి.

వాహనం నుంచి పవన్ కళ్యాణ్ ప్రసంగించే సందర్భంలో – లైటింగ్ పరమైన ఇబ్బందులు లేకుండా వాహనం చుట్టూ లైట్లు ఏర్పాట్లు చేశామని..ఆధునిక సౌండ్ సిస్టం వినియోగించారని పేర్కొంది. వేల మందికి స్పష్టంగా పవన్ కళ్యాణ్ ప్రసంగం వినిపించే విధంగా ఈ సౌండ్ సిస్టం ఉంటుంది. వారాహి.. వాహనానికి నలువైపులా సీసీ కెమెరాలు అమర్చారు.వాహనం నిలిపిన, సభ నిర్వహించే ప్రదేశంలో పరిస్థితి రికార్డయ్యే ఫుటేజ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సర్వర్ కి రియల్ టైంలో వెళ్తుంది.

2008 నుంచి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ పర్యటనల్లో ఎదురయిన అంశాలని దృష్టిలో ఉంచుకొని భద్రత చర్యలు తీసుకున్నారు. వాహనం లోపల పవన్ కళ్యాణుతో పాటు మరో ఇద్దరు కూర్చొని చర్చించుకునే ఏర్పాటు ఉంది. అక్కడి నుంచి హైడ్రాలిక్ విధానంలో మెట్లు ఉంటాయి. వాటి ద్వారా వాహనం మీదకు చేరవచ్చు. జగిత్యాల జిల్లా కొండగట్టు క్షేత్రంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేయించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. తదుపరి ఈ వాహనం పర్యటనకు వస్తుందని ప్రకటనలో వివరించింది జనసేన పార్టీ.

Read more RELATED
Recommended to you

Latest news