కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాలను ఇంటికి పంపాలని.. అందుకు తమతో కలిసి వచ్చే పార్టీలతో పనిచేస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పష్టం చేశారు. బిజెపి, వైసిపి ఒకరికొకరు పరస్పరం కలిసిపోయారని రామకృష్ణ అన్నారు. కేంద్రానికి ప్రతి విషయంలో వైసీపీ ఎంపీలు సహకరిస్తున్నారని, వైసిపి, బిజెపి పెళ్లి చేసుకోలేదు కానీ కలిసి కాపురం చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతకాలంటే పవన్ కళ్యాణ్ బిజెపి నుంచి బయటకు రావాలన్నారు.
జనసేన, టిడిపి, సిపిఐ, సిపిఎం లాంటి పార్టీలు ఒకే వేదిక పైకి వచ్చి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు త్వరలోనే సమావేశం అవుతామని వెల్లడించారు రామకృష్ణ. ప్రస్తుతం ఏపీలో పోలీస్ రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. వైసిపి మంత్రుల బ్లాక్ మెయిల్ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భయపడుతున్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ బిజెపి ని రోడ్ మ్యాప్ అడుగుతున్నారంటే ఆయన అమాయకుడు అనుకోవాలా? లేక అన్నీ తెలిసే నటిస్తున్నాడా? అని ప్రశ్నించారు.