జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో అధికారంలోకి రాని పార్టీ గురించి అధికారులెవ్వరూ భయపడాల్సిన పని లేదని.. ఐఏఎస్సులు, ఐపీఎస్సులు అధికార పార్టీ నేతల ముందు మోకాళ్ల మీద కూర్చోన్నారంటే పరిపాలనా ఉన్నట్టేనా..? అని ఫైర్ అయ్యారు. పరిపాలన లేని రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏం ఉంటాయి..? అని నిలదీశారు.
పొత్తులో ఉన్నామంటే ప్రశ్నించం అని కాదని… పొత్తులో ఉన్న పార్టీతో 70 శాతం అంశాలపై ఏకాభిప్రాయం ఉంటే.. 30 శాతం అంశాలపై భిన్నాభిప్రాయాలు ఉంటాయని చెప్పారు. నా ఈ వ్యాఖ్యలకు విపరీతార్ధాలు తీయొద్దని.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు జనసేన వ్యతిరేకమని చెప్పారు.
కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో మనస్సు మార్చుకుంటుందని అనుకుంటున్నానని.. విశాఖ స్టీల్ ప్లాంటుకు గనులు కేటాయిస్తుందని అనుకుంటున్నానని వెల్లడించారు.
పెట్రోల్ డీజీల్ ధరలను తగ్గించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని.. పార్టీని ఎలా నడుపుతున్నారని చాలా మంది అడుగుతున్నారని పేర్కొన్నారు. అందరినీ ఏకం చేసే భావం జాలం.. ఒత్తిళ్లని తట్టుకునే మానసిక స్థైర్యం ఉంటేనే పార్టీని నడపడం సాధ్యమన్నారు. ఈ ప్రయాణంలో జనసేన నేతలు.. కార్యకర్తలే నాకు కొండంత బలమని.. కాన్షీరాం స్ఫూర్తితో పార్టీని రన్ చేస్తున్నామని ప్రకటన చేశారు.