మంగళగిరిలో జనసేన పార్టీ మండల స్థాయి అధ్యక్షులతో సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఓట్లు వేస్తేనే కదా నేను సీఎం
అయ్యేది అని అన్నారు ఆయన. అప్పుడు ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన సమయంలో ఇన్ని పార్టీలు లేవని, అప్పుడున్న పరిస్థితులు వేరని, అప్పుడున్న వ్యక్తులు కూడా వేరని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. ఉపేంద్ర, నాదెండ్ల భాస్కరరావు, ఎన్జీ రంగా వంటి నాయకులు ఎన్టీఆర్ దిశానిర్దేశం చేశారని తెలిపారు. అప్పుడు ప్రధాన పార్టీ అంటే కాంగ్రెస్ ఒక్కటేనని తెలిపారు. డబ్బు, పగ, ప్రతీకారాలు అప్పట్లో లేవని పేర్కొన్నారు. ఇప్పుటి పరిస్థితులు ఎంతో భిన్నం అని, ఒక్కో అడుగు వేసుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళుతున్నానని అన్నారు పవన్ కళ్యాణ్.
2014లో నేను టీడీపీ, బీజేపీకి సపోర్ట్ చేశాను. నా వల్ల కొందరు ఎమ్మెల్యేలు.. ఎంపీలు అయ్యారని తెలిపారు పవన్.. వైసీపీలో కొందరు సకల కళా కోవిదులున్నారని సెటైర్లు వేసిన ఆయన.. చిట్టి చిట్టి అడుగులేసుకుంటూ.. క్యూట్ క్యూట్ గా నన్ను విమర్శించేందుకు కొందరు నేతలు వస్తారు కదా..? వాళ్లని సీఎం అభ్యర్థులుగా ప్రకటించండి అంటూ సలహా ఇచ్చారు. మేం చేయలేమని వైసీపీ భావిస్తే.. మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటారు..? టీడీపీనైనా పట్టించుకోవడం లేదు కానీ.. మమ్మల్ని మాత్రం వదలడం లేదు.
వైసీపీకి మేమంటే భయం అందుకే మమ్మల్ని విమర్శిస్తున్నారని తెలిపారు. డిసెంబరులో ఎన్నికలు పెడతారు.. జూన్ నుంచి ప్రజల్లో తిరుగుతానని పేర్కొన్నారు పవన్. సీఎం అభ్యర్థిత్వానికి ఒప్పుకోకుంటే పొత్తు వద్దంటూ సలహాలు ఇస్తున్నారు.. గతంలో నాకెందుకు సపోర్ట్ చేయలేదు..? అని ప్రశ్నించారు. సలహాలిచ్చేవాళ్లంతా నా కోసం భీమవరంలో ఎందుకు ప్రచారం చేయలేదు. సలహాలిచ్చేవాళ్లెవరూ నాతో లేరు.. కార్యకర్తలే నాతో ఉన్నారని తెలిపారు.