శనివారం ఇప్పటం గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఎన్‌కౌంటర్లకే భయపడను… అరెస్ట్‌లకు భయపడతానా అని అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అనంతరం రాష్ట్రంలో మహానుభావుల విగ్రహాలు పడగొట్టారని… దేవతామూర్తుల విగ్రహాలు కూలగొట్టారని ఆయన మండిపడ్డారు.
అయితే వైఎస్సార్ విగ్రహాలు పడగొట్టరని… అడ్డుగా ఉన్నా, అవసరం లేకున్నా పోలీసులు రక్షణ కల్పిస్తారని జనసేనాని తెలిపారు. ‘‘ఇప్పటంలో విగ్రహం అవతల ఉన్న నివాసాలను కూల్చేశారు.. ఈ తరహా ఘటనలపై ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. రోడ్డు పక్కన ఉన్న వైయస్ విగ్రహం మాత్రం అడ్డు లేదంట. ఇదీ వైసీపీ అకృత్యాలకు నిదర్శనం’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఇప్పటం గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు రోడ్డుకు అడ్డంగా కంచెలు ఏర్పాటు చేశారు. అయితే పోలీసులు కుట్రపూరితంగానే కంచెలు ఏర్పాటు చేస్తున్నారని జనసేన అభిమానులు ఆరోపిస్తున్నారు. పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో ఇప్పటంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటం గ్రామంలో జనసేన మద్దతుదారుల ఇళ్లు ధ్వంసం చేశారని, బస్సు లేని గ్రామానికి 100 అడుగుల రోడ్డు పేరుతో ఇళ్ళు కూల్చివేయడంపై ఇప్పటికే పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.