జగన్ మంత్రి వర్గ సహచరులు ఏం చెప్పినా బాగుంటుంది. ఏం చెప్పినా అందంగా ఉంటుంది మరియు వాటి అర్థాలు కూడా చాలా విస్తృతంగానే ఉంటాయి. అందుకే పేర్నినాని లాంటి పెద్ద పెద్ద నాయకుల మాటలను అంత వేగంగా కొట్టేయడం జరగని పని. ఆయన ఏం చెప్పినా దానికో లెక్కుంటది. ఆ లెక్క అనుసారమే చిరు తో జగన్ చేసిన భేటీలో ఏమీ మాట్లాడకుండానే అవకాయ,పప్పు తిని వెళ్లారు ఇద్దరూ అంతేనా! ఈ పాటి మెనూ హైద్రాబాద్ లో చిరుకు దొరకక విజయవాడకు వచ్చారు. అక్కడి నుంచి జగన్ ఇంటికి వెళ్లారు.. అంతేనా! అంతేలే! మీరేం చెబితే అదే వేదం వాదం కూడా! విని తరిస్తాం విని ఆనందిస్తాం కూడా!
సినిమా టికెట్ ధరల తగ్గింపునకు సంబంధించి రగడ నెలకొంటున్న నేపథ్యంలో మళ్లీ మంత్రి నాని మరో చర్చకు తెరలేపారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో టికెట్ ధరలపై తెలంగాణలో కూడా చర్చ నడుస్తోంది.ఇప్పుడున్న ధరలకు అనుగుణంగా తాము థియేటర్లను నడపలేమని మంత్రి పేర్ని నానితో చాలా థియేటర్ యాజమాన్యాలు తెగేసి చెప్పేశాయి. కొన్ని ఇటీవలే మూతపడ్డాయి కూడా!
ఈ తరుణంలో పరిశ్రమకు అండగా నిలిచి సమస్యను పరిష్కరించాలన్న ఏకైక తలంపుతో చిరు సీన్ లోకి దిగారు. హైద్రాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకుని సీఎం జగన్ తో లంచ్ మీట్ లో పాల్గొన్న సంగతి విధితమే! అయితే దీనిపై నిన్నటి వేళ పేర్ని నాని చెబుతున్న మాటలు విడ్డూరంగా ఉన్నాయి. జగన్ కూ, చిరుకూ మధ్య అసలు ఏ చర్చలూ జరగలేదని, ఏదో భోజనం చేసి వెళ్లారని చెప్పి సంచలనం అయ్యారు.అయినా చర్చలెక్కడయినా సీఎం నివాసంలో జరుగుతాయా?
చెప్పండి ఏ సచివాలయంలోనో లేదా ఇంకెక్కడో జరుగుతాయి కానీ.. అని వ్యాఖ్యానించి మరో వివాదం రేపారు.అసలు టికెట్ ధరలపై క్యాబినెట్ లో అయినా ఎందుకు మాట్లాడాలి.. అలాంటి చిన్న చిన్న సమస్యలు క్యాబినెట్ లో ఎందుకు చర్చకు వస్తాయి అని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు నాని. అంటే మొన్నటి వేళ చిరుతో జగన్ టికెట్ల విషయమై మాట్లాడలేదని నాని ధ్రువీకరిస్తున్నా రు. ఆ రోజు ఈ విషయమే చర్చకు రాలేదు. కేవలం భోజనం చేసి పోయేందుకే స్పెషల్ ఫ్లైట్ ఒకటి బుక్ చేసి ఇటు వచ్చారు చిరు. అంతే అంటారా మంత్రి గారూ!ఈ విషయమేదో ఆ రోజే చెబితే బాగుండు కదా మీటింగ్ అయిన వారం రోజులకు మీరు క్లారిఫికేషన్ ఇవ్వడం ఏంటి?