ఒత్తిడితో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయనేది కొంతమంది చెబుతుంటారు. అలా చెప్పేవాళ్ళందరూ తమ కింది వారిచేత పనిచేయించుకోవడానికే అలా చెబుతుంటారనేది కొంత మంది వాదన. పనిలో ఆనందం పొందాలి గానీ ఒత్తిడిగా ఫీల్ అవకూడదనేది జీవితాన్ని హాయిగా జీవించాలని చెప్పేవాళ్ళు చెప్పే మాట. నెత్తి మీద బరువు ఉంటే ముందుకు చూస్తాం.. నిజమే కావచ్చు. కానీ మోయాల్సిన దానికంటే ఎక్కువ బరువుంటే కిందపడిపోతాం అని కూడా తెలుసుకోవాలి.
మనం బరువు పెరగడం ఎంత మంచిది కాదో, మన మీద బరువు పెంచుకోవడమూ మంచిది కాదు. ఒత్తిడి తీసి పక్కన పెట్టేయాలి. నిన్నటి వరకు మీ జీవితంలో జరిగిందేదో జరిగిపోయింది. నిన్నటి గురించి ఆలోచిస్తూ ఈ రోజులో ఉన్న ఆనందాన్ని కోల్పోవద్దు. నువ్వు ప్రతిరోజూ బ్రతికేది ఈరోజులోనే అనే విషయం గుర్తుంచుకోవాలి. ఈరోజు ఒక సమస్యకి పరిష్కారం దొరికిందంటే, రేపొక సమస్య కొత్తగా పుట్టే అవకాశం ఉంటుంది. సమస్య సాల్వ్ అయ్యే వరకూ నెత్తిమీద టెన్షన్ పెట్టుకునే కూర్చుంటా అంటే వాళ్ళ జీవితాల్లో సమస్యలనేవి ఎప్పటికీ తీరవు.
ఈరోజు పొద్దున్న నిద్రలేచేటపుడు ఈ రోజుని చాలా కొత్తగా అనుభవించాలని డిసైడ్ అవ్వండి. నిన్నటి కంటే ఈ రోజు బాగా ఉండడానికే ప్రయత్నించండి. నిన్న మీకు కలగజేసిన దుఃఖాన్ని మర్చిపోండి. అన్నింటినీ గుర్తు పెట్టుకుని మీ మెదడుని చెత్తబుట్ట చేయకండి. బాధ కలగజేసిన వాటిని మర్చిపోండి. లేదంటే మీకు ప్రతీసారీ గుర్తొచ్చి మిమ్మల్ని బాధపెడుతూనే ఉంటుంది.
నేర్చుకునేటపుడు జీవితం చాలా పెద్దది అనుకోవడం బెటర్. ఆనందించేటపుడు జీవితం చాలా చిన్నది అనుకోండి. పెద్దలు చెప్పిన ఈ మాట అక్షర సత్యం. ఆనందం ముఖ్యం. అది ఎందులో ఉందో గ్రహించండి. దానికోసం ప్రయత్నించండి. ఆనందాన్ని జుర్రుకోండి.