కొంతకాలం కలిసున్నారు.. తర్వాత పరస్పర ఆమోదయోగ్యంతో విడాకులు తీసుకున్నారు. లోపాయికారీగా కలిసి పనిచేశారు. ఇదంతా కాదులే… విడాకులు రద్దుచేసుకొని కలిసుందామనుకుంటున్నారు. దానివల్ల ఇద్దరికీ లాభమేనని లెక్కలేసుకుంటున్నారు. లెక్కలు పెద్దగా తెలియనివారికి కూడా మైనస్సూ, మైనస్సూ కలిస్తే ప్లస్సవుతుందని చెపుతారు. ఈ లెక్కనే ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత రాజకీయాలకు వర్తింపచేస్తే.. ఏమవుతుంది? ప్లస్సవుతుందా? అంటే అవుతుందనే సమాధానం వస్తోంది. ఎందుకు విడిపోయారు? ఎందుకు కలవాలనుకుంటున్నారో? వారికే తెలియాలి.
బీజేపీకి రాం..రాం..
ఇటీవల వెల్లడైన స్థానిక సంస్థల ఫలితాల్లో పొత్తు లేకుండా వెళ్లకూడదని టీడీపీకి, బీజేపీతో ఎటువంటి ఉపయోగం లేదని జనసేనకు ఒక స్పష్టత వచ్చింది. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ బీజేపీకి రాంరాం చెబితే ఎలావుంటుంది? చంద్రబాబు, పవన్ పొత్తు పెట్టుకుంటే ఎలావుంటుంది? అంటూ రాజకీయవర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కలిసుందామనుకుంటున్నారా? ఇప్పుడు రెండు తెలుగురాష్ట్రాల్లో ఇదే చర్చ. ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల్లో ఇరుపార్టీలు కొన్ని ప్రాంతాల్లో కలిసి పనిచేశాయి. అభిమానుల బలాన్ని సద్వినియోగం చేసుకోలేని స్థితిలో పవన్‌కల్యాణ్ ఉండగా, పురపాలక ఎన్నికల్లో ఓటమితో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నీరుగారిపోయున్నారు. చంద్రబాబు తర్వాత తెలుగుదేశం పార్టీకి దిక్కెవరు? అనే ప్రశ్నకు కూడా సమాధానం దొరకడంలేదు. టీడీపీకి పూర్వవైభవం తేవాలంటే లోకేష్‌ను పక్కనపెట్టడమొక్కటే కనపడుతోంది. దీనికి చంద్రబాబు అంగీకరిస్తారా? లేదా? అనేది తేలడంలేదు. టీడీపీ వర్గాలుకానీ, జనసేన వర్గాలుకానీ ఇరుపార్టీలు కలవాలని, కలిసుండాలని అంతర్గతంగా కోరుకుంటున్నారు.
వ్యూహానికి ప్రచారం తోడవ్వాలి
చంద్రబాబునాయుడికన్నా పవన్‌కల్యాణ్‌కే క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటి ఉందన్నది వాస్తవం. కాబట్టి చంద్రబాబునాయుడు వాస్తవ పరిస్థితిని అంచనా వేసుకొని పవన్‌కల్యాణ్‌ను దగ్గరకు తీసుకుంటే ఇద్దరికీ మంచిది. తెలుగుదేశం, జనసేన కలవడమా? తెలుగుదేశంలో జనసేన విలీనమవడమా? అనేదానిపైనే ఎక్కువగా చర్చ నడుస్తోంది. .చంద్రబాబు వ్యూహాలకు, పవన్ కల్యాణ్ పర్యటనలకు టీడీపీ నేతలు, పవన్ అభిమానులు తోడైతే ఇద్దరి పరిస్ధితి మళ్ళీ పుంజుకునే అవకాశం కనపడుతోంది. ఈ ఇద్దరి మదిలో ఏముందో త్వరగా బయటపడితేనే ఏపీ రాజకీయాలపై ఒక స్పష్టత వస్తుంది. బీజేపీని కాదని పవన్ బయటకొస్తారా? ఒకవేళ బీజేపీ చంద్రబాబుకు దగ్గరవ్వాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటువంటి సందిగ్ద పరిస్థితుల్లో టీడీపీ అధినేత ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి!!.