ఛత్తీస్‌ఘడ్ జిల్లా నారాయణ్‌పుర్ జిల్లాలో నక్సల్స్ విరుచుకుపడ్డారు. నారాయణపూర్ నుంచి బస్సులో వెళ్తుండగా ఐఈడీతో పేల్చారు. జిల్లా రిజర్వ్ గార్డు(డీఆర్జీ) జవాన్లతో నిండిన బస్సును నక్సలైట్లు పేల్చివేశారు. ఈ సంఘటనలో, 3 సైనికులు మృతి చెందగా సుమారు 12 మంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారని చెబుతున్నారు. అయితే జవాన్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సైనికులందరూ ఆపరేషన్ నుండి తిరిగి వస్తున్నారని అంటున్నారు.
ఛత్తీస్గఢ్ డీజీపీ అవస్థి చెబుతోన్న వివరాల ప్రకారం 45 వ బెటాలియన్ ఐటీబీపీ సిబ్బంది గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 27 మంది జవాన్లు ఉన్నట్లు చెబుతున్నారు. పేలుడు జరిగిన ఏరియాకు చేరుకున్న భారత బలగాలు తనిఖీలు మొదలు పెట్టాయి. నారాయణపూర్ జిల్లాలో కడేనార్, కన్హరగావ్‌ల మధ్య వెళ్తున్న ఈ బస్సును లక్ష్యంగా చేసుకొని ఐఈడీ పేల్చడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఐటీబీపీ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు.