పంజాబ్ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ భద్రతా వైఫల్యాలపై సుప్రీంకోర్ట్ లో పిటీషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈరోజు సుప్రీం కోర్ట్ ఈ పిటీషన్ ను విచారించింది. దీంట్లో భాగంగా పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా ఆయన ప్రయాణ రికార్డులను వెంటనే భద్రపరచాలని పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది.
పంజాబ్ మరియు పోలీసు అధికారులు, SPG మరియు ఇతర కేంద్ర మరియు రాష్ట్ర ఏజెన్సీలు సహకరించాలని మరియు మొత్తం రికార్డును సీల్ చేయడానికి అవసరమైన సహాయం అందించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇదే విధంగా విచారణకు సహకరించాలని ఆదేశించింది.
సుప్రీం కోర్ట్ లో వాదనల సందర్భంగా…ఈ ఘటన అంతర్జాతీయంగా తలవంపులు తెచ్చిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. ఈ విషయాన్ని కేవలం ఎవరికీ వదిలేయలేమని, ఇది సీమాంతర ఉగ్రవాదానికి సంబంధించిన అంశమని, కాబట్టి ఎన్‌ఐఏ చేత విచారణ జరిపించాలని సుప్రీంకోర్టుకు తెలిపారు. పంజాబ్ ప్రభుత్వం ఈ అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటోందని పంజాబ్ ఏజీ సీనియర్ న్యాయవాది డీఎస్ పట్వాలియా సుప్రీంకోర్టుకు తెలిపారు. ఘటన జరిగిన రోజునే రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని వేసిందన్నారు.