అగ్నిపథ్ ఆందోళనల నేపథ్యంలో రణరంగంగా మారిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఎట్టకేలకు పరిస్థితి కుదుట పడింది. భారీగా మోహరించిన ఆర్పీఎఫ్, జీఆర్పీ, రాష్ట్ర పోలీసు బలగాలు ఆందోళనకారులను ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకున్నాయి. ప్లాట్ ఫాం ఒకటి నుంచి 10 వరకు పట్టాలపై
బైఠాయించిన నిరసనకారులను అక్కడి నుంచి చెదరగొట్టారు. ఆందోళనకారులతో చర్చలు జరిపేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆర్మీ నియామక అధికారి వద్దకు ఇద్దరిని తీసుకెళ్తామని ఆందోళనకారులకు నచ్చజెప్పినా వారు శాంతించలేదు. తాము చర్చలకు వెళ్లే ప్రసక్తే లేదని, ఆర్మీ ఉద్యోగ నియామక అధికారి తమవద్దకు రావాలని డిమాండ్ చేశారు.
దీంతో ఉదయం నుంచి వేచి చూసిన పోలీసులు సాయంత్రం 6 గంటల సమయంలో ఒక్కసారిగా ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 7 గంటలుగా కొనసాగుతోన్న ఆందోళనకారులు నిరసనలకు ఫుల్స్టాప్ పడే దిశగా అధికారులు పడుతున్నాయి. ఒక్కసారిగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగింది. ఆందోళనకారులను ఒక్కొక్కరిగా అరెస్ట్ చేస్తూ బయటకు తీసుకొస్తున్నారు. . దాదాపు నాలుగు వేల మంది పోలీసులు, స్టేషన్ను నాలుగు వైపుల నుంచి చుట్టుముట్టి విద్యార్థులను బయటకు పంపిస్తున్నారు.