కరీంనగర్: హుజురాబాద్‌లో రాజకీయాలు వేడెక్కాయి. ఉపఎన్నికలో గెలివాలని అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. ఎలాగైనా సరే ఎమ్మెల్యేగా మళ్లీ గెలవాలని అటు ఈటలతో పాటు ఆయన కుటుంబం కూడా ప్రయత్నిస్తోంది. అయితే ఇప్పుడు పార్టీలన్నీ కూడా కులాల వారీగా లెక్కలేస్తున్నాయి. ఈటల బీసీ కావడం ఆ కులం నుంచి ఆయనకు కలిసొచ్చే అంశంగా అధికార పార్టీ భావిస్తోంది.
మరోవైపు హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత ఓటర్లు ఎక్కువగా ఉండటంతో గులాబీ బాస్ పుల్ ఫోకస్ పెట్టారు. ఈటలకు ఆ కులం ఓట్లు దక్కుకుండా చేసేందుకు వ్యూహాలు రచించారు. ఈ మేరకు దళిత బందు ప్రవేశ పెట్టారు. దళితులను ఆకర్షించి అత్యధిక ఓట్ల దండుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటీకే హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన ముఖ్యమైన దళిత నేతలను సీఎం కేసీఆర్ కలిశారు.
అటు ఈటల రాజేందర్ కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గంలోని దళితులను కలుస్తున్నారు. ఆయన కుటుంబసభ్యులు కూడా ఈటల గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ చెప్పిన దళిత ముఖ్యమంత్రి హామీలపై ప్రశ్నిస్తున్నారు. టీఆర్ఎస్ చెందిన దళిత ఎమ్మెల్యేలు, మంత్రులను ఈటల బావమరిది మధుసూధన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. దీంతో హుజూరాబాద్ ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ బావమరిది మధుసూదన్ రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. ఈటలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈటల కుటుంబంపై కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో ఈటల కుటుంబ జోక్యం అవుతోందని, ఈటలకు చిక్కులు తప్పవని హెచ్చరించారు.