మామా అల్లుళ్ల సవాల్..పరువు కోసమా,ఆధిపత్యం కోసమా ?

-

ఇద్దరూ వరుసకు మామా అల్లుళ్లు..కానీ రాజకీయంగా మాత్రం బద్ధశత్రువులేనట. తాజాగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు ఇద్దరికీ ప్రెస్టేజ్‌ గా మారాయి. ఒకరేమో అసెంబ్లీ మొత్తానికి బాస్ అయితే మరొకరేమో జిల్లా సైకిల్ పార్టీకి బాస్ కావడంతో పంచాయతీ పోరులో ఎక్కడా తగ్గటం లేదట. మామా అల్లుళ్ల పంతం సిక్కోలు జిల్లాలో హాట్‌ టాపిక్‌ గా మారుతోంది.

సిక్కోలులో ఫ్యామిలీ పాలిటిక్స్ కు కేరాఫ్ అయిన ఆమదాలవలసలో మరోమారు కుటుంబ రాజకీయాలు తెరపైకి వచ్చాయి. ఆముదాలవలస పేరు చెప్పగానే గుర్తొచ్చేది తమ్మినేని సీతారాం, కూన రవికుమార్. ఈ ఇద్దరు మామా అల్లుళ్ల మధ్య సర్పంచ్ ఎన్నికలు మరింత చిచ్చు రాజేస్తున్నాయట. ఒకప్పుడు ఒకే పార్టీలో కలిసి పనిచేసిన తమ్మినేని , కూన రవికుమార్ మధ్య 2009 ఎన్నికల సమయంలో గ్యాప్ వచ్చింది. తమ్మినేని టీడీపీని వీడి ప్రజారాజ్యంలో చేరడంతో ఆమదాలవలస టీడీపీకి కూనరవికుమార్ పెద్ద దిక్కయ్యాడు. నియోజకవర్గ బాధ్యతలు భుజానవేసుకున్న కూనరవి టీడీపీ నుంచి, వైసీపీ తరపున తమ్మినేని సీతారాం 2014, 2019 ఎన్నికల్లో బరిలో దిగి ఇద్దరూ చెరోసారి గెలిచారు.

గతంలో కూన రవికుమార్ ప్రభుత్వ విప్ గా అధికారంలో ఉన్నప్పుడు తమ్మినేని ఆయన్ని టార్గెట్ చేసి నిత్యం విమర్శించడమే పనిగా పెట్టుకున్నారట. మొన్నటి ఎన్నికల్లో తమ్మినేని గెలిచి ఏకంగా అసెంబ్లీకి స్పీకర్ గా అత్యున్నత పదవికి ఎంపికైన తర్వాత సీన్‌ రివర్స్‌ లో నడుస్తోంది. ఏడాదిన్నర కాలంగా కూన రవి ఆయన్ను కార్నర్ చేస్తూనే ఉన్నారు.

ఇద్దరి మధ్యా రాజకీయాలు ఉధృతంగా ఉన్న సమయంలో పంచాయతీ ఎన్నికలు వచ్చి పడ్డాయి. దీంతో మామా అల్లుళ్ల మధ్య పోటీ మరీ తీవ్రమైందట. సీనియర్ నాయకుడిగా పేరున్న తమ్మినేని నియోజకవర్గ పరిధిలోని 108 పంచాయతీల్లో కేవలం ఒకే ఒక్క పంచాయతీని ఏకగ్రీవం చేసుకోగలిగారట. ఇప్పుడు ఇదే అటు ఆమదాలవలసలోనూ ఇటు జిల్లా వైసీపీలోనే చర్చనీయాంశంగా మారిందట. కూనరవికుమార్ ప్రస్తుతం శ్రీకాకుళం పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా ఉండటం..పైగా ఆమదాలవలస నియోజకవర్గానికి ఇంఛార్జి కూడా కావడంతో ఆయన కూడా ఈ పంచాయతీ ఎన్నికల పై స్పెషల్ ఫోకస్ పెట్టారట.

తమ్మినేని స్వగ్రామం తొగరాంలోనూ పట్టుబట్టి మరీ తమ్మినేని సతీమణి వాణికి పోటీగా ఆమె తోటికోడలినే పోటీలో ఉండేలా చేయడం వెనుక కర్త , కర్మ ,క్రియ అన్నీ కూనరవి కావడంతో తమ్మినేనికి ఇంటా ,బయటా అల్లుడి రూపంలో సెగ పెరిగిందని టాక్‌ నడుస్తోంది. మొత్తానికి ఎన్నికల ఫలితాల్లో తమ్మినేని పై చేయి సాధించినా మామా అల్లుళ్ల పంతం మాత్రం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.

 

Read more RELATED
Recommended to you

Latest news