కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా బుధవారం కరీంనగర్ కు బండి సంజయ్ వచ్చారు. సొంత గడ్డను చూసి పులకరించిపోయిన బండి సంజయ్ నేలతల్లిని ముద్దాడారు. అనంతరం కరీంనగర్ లోని మహాలక్ష్మి అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. ఆ తర్వాత అక్కడే మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల వరకే రాజకీయాలు ఉంటాయని ఆ తర్వాత పార్టీలకు అతీతంగా అందరూ ఎమ్మెల్యేలను, నాయకులు, కార్యకర్తలను కలుపుకుని అభివృద్ధి కోసం కృషి చేస్తానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు.
తనకు వచ్చిన ఈ పదవి బాధ్యతలు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు పెట్టిన బిక్ష అని అన్నారు.కార్యకర్తల కష్టం, పార్టీ పెద్దల మద్దతుతో తాను నాయకుడిగా, కేంద్ర మంత్రిగా అయ్యానని తెలిపారు. రాజకీయంగా ఇంతటి వాడిని చేసిన తెలంగాణకు, కరీంనగర్ కు సెల్యూట్ చేస్తున్నానని అన్నారు.కార్పొరేటర్ స్థాయి నుంచి కేంద్ర మంత్రి స్థాయి వరకు ఎదిగానంటే ఇది కేవలం బీజేపీ లోనే సాధ్యం అవుతుందని అన్నారు.బీఆర్ఎస్ మూర్ఖత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు, నాయకులు తిన్న పోలీసుల లాఠీ దెబ్బలు, గృహనిర్భంధాలు, జైలు జీవితాల వల్లే తనకు కేంద్ర మంత్రి పదవి దక్కిందని బండి సంజయ్ అన్నారు.