అంబేద్కర్ పేరు కోనసీమకు పెట్టడం కానీ పెట్టుకున్న తీరు కానీ చాలా బాగుందన్న వాదన కూడా కోనసీమలోనే ఉంది. అయినా కాపులు, దళితుల మధ్య వివాదం రేపిన వైనం ఒకటి త్వరలోనే ముగిసి పోనుందని కూడా అంటున్నారు కొందరు. ఏం కాదు ఇవన్నీ రాజకీయ దురుద్దేశాలతో చేసినవే !అని కాపునాడు చెబుతోంది. కనుక ఆలోచిస్తే త్వరలో అక్కడ శాంతి పునరుద్ధరణే కాదు మున్ముందు కాలంలో అంబేద్కర్ పేరు ను ఆ జిల్లాకు స్థిరం చేయడంలో కూడా ఆ రెండు వర్గాలూ కలిసే పనిచేయనున్నాయని తెలుస్తోంది. ప్రభుత్వం కూడా పేరు మార్పు ఉండదని చెబుతోంది. ఈ నేపథ్యంలో ఓ జంట ఓ అడుగు ముందుకు వేసింది. ఓ విధంగా పెళ్లంటే ఏడంటే ఏడే అడుగులు కదా! ఆ విధంగా ఈ అడుగు మొదటి అడుగు అనుకోండి.
ఆ విధంగా ఓ మంచి మార్పునకు శ్రీకారం కూడా ! వాళ్లంతా గొప్ప గౌరవంగా భావిస్తూ తమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని స్వాగతిస్తూ అయినవిల్లి వినాయకుడి సాక్షిగా ఇవాళ వివాహ వేడుకకు సిద్ధం అవుతూ ఉన్నారు. ఇంతకూ ఈ వేడుకకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే…
వివాహ సందర్భంగా ప్రచురితం అయ్యే శుభ లేఖలకో ప్రత్యేకత ఉంటుంది. ఆ విధంగా ఆ పెళ్లి కార్డులపై ప్రచురితం అయిన పేరుకు కూడా ఓ ప్రత్యేకత ఉంది. ఇప్పుడు అట్టుడికి పోతున్న కోనసీమ కు సంబంధించిందే ఆ కార్డు. ఆ కార్డుపై తొలిసారి డాక్టర్ బి.ఆర్.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అని ప్రచురించి ఓ జంట సంచలనం రేపింది. అన్నట్లు పెళ్లెప్పుడో చెప్పలేదు కదూ ! ఇవాళే ! ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషాలకు.. బాగుంది కదూ! దైవం దీవెనలు అందుకుని ఈ జంట మరిన్ని మంచి విజయాలు అందుకోవాలని ఆశీర్వాదాలు అందించండి పెద్దలారా ! అయినవల్లి మండలంలో జరిగే ఈ వేడుకకు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి ప్రజలంతా తరలి రానున్నారు. కోరపు వారింటి వేడుక ఇది.
ఎపార్ట్ ఫ్రమ్ దిస్.. : ఇప్పుడు కాస్త ప్రశాంతం
ఇక కోనసీమలో ప్రశాంతతను తిరిగి నెలకొల్పేందుకు పోలీసులు మరింత ప్రయత్నాలు చేస్తున్నారు. ఉన్నత స్థాయి అధికారుల నేతృత్వంలో బలగాలు నిరంతరం పహారా కాస్తున్నాయి. నిన్నటి సాయంత్రం రావుల పాలెంలో కొద్దిపాటి ఉద్రిక్తతలు నెలకొన్నా తరువాత అవి పోలీసుల జోక్యంతో సర్దుమణిగాయి. ఇవాళ ఆ ప్రాంతంలో కొన్ని పెళ్లిళ్లు ఉన్నాయి. వాటిని కూడా పోలీసు పహారా నేపథ్యంలోనే నిర్వహించనున్నారు. అదేవిధంగా యువకులను కూడా పోలీసులు పిలిచి కౌన్సిలింగ్ ఇస్తుండడంతో కాస్త పరిస్థితిలో మార్పు వచ్చిందని తెలుస్తోంది.