త్వరలో అసెంబ్లీ సమావేశాలు.. ఇవే బలాబలాలు!

-

ఇంతకాలం కరోనా కారణంగా స్థబ్ధగా ఉన్న ఏపీ రాజకీయం ఇప్పుడిప్పుడే కాస్త వేడెక్కుతుంది. ఏపీ రోడ్ల పరిస్థితిపై జనసేన రాజకీయం షురూ చేసింది. చంద్రబాబు ఇప్పటికీ ఆన్ లైన్ కే పరిమితమైనా… హత్యలు, మరణాలు జరిగినచోట చినబాబు లోకేష్ వాలిపోతున్నారు.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. వినాయకచవితి పేరుచెప్పి బీజేపీ హడావిడి మొదలైంది. దీంతో… ఈసారి అసెంబ్లీ సమావేశాలు కాస్త రసవత్తరంగానే ఉండొచ్చని అంటున్నారు విశ్లేషకులు.

పత్రికల్లో వచ్చే వార్తలు, మీడియా కథనాలను మాత్రమే నమ్మిన ప్రజలకు.. వీలైనన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే సమయం ఆసన్నమైంది. ప్రభుత్వంపై వస్తున్న విమర్శలపై స్పష్టత రానుంది. ఈనెల 21వ తేదీ అందుకు ముహూర్తం అని సమాచారం అందుతుంది! అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు, ఈనెల 21 లేదా 22 తేదీల్లో ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈనెల 16వ తేదీన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం ఏర్పాటు కానున్న నేపథ్యంలో… ఆ మీటింగ్ లోనే అసెంబ్లీ సమావేశాలు షెడ్యూల్ అయ్యే అవకాశముంది.

అయితే… జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఏపార్టీ బలం ఎంతుంది.. ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం!

బలంగా అధికారపార్టీ: ఏపీలో అధికారపార్టీ అత్యంత బలంగా ఉంది. అయితే.. కరోనా కారణంగా ఏపీ ఆర్థిక పరిస్థితి దెబ్బతినడం.. రోడ్ల వ్యవస్థ అధ్వాన్నంగా ఉండటం.. మహిళలపై జరుగుతున్న దాడులు.. ఈసారి ప్రభుత్వానికి సమస్యగా పరిణమించే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఈసారి సమావేశాల్లో… ఏపీ రాజధానిపై మరొక్కసారి జగన్ సర్కార్ సుస్పష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

చంద్రబాబుకు ఇవే పట్లు: ప్రస్తుతం ఏపీలో ప్రతిపక్షాల పాత్రేమీ పెద్దగా లేకుండా దూసుకుపోతున్న జగన్ సర్కార్ కు.. కరోనా కారణంగానో, ఒంటెద్దుపోకడలవల్లనో కొన్ని సమస్యలు వచ్చిపడ్డాయి! అయితే.. ఈ సారి అసెంబ్లీ సమావేశాల్లో వాటిపై తీవ్ర కసరత్తులు చేయాలని టీడీపీ భావిస్తుంది. గత అసెంబ్లీ సమావేశాలను తెలుగుదేశం పార్టీ బాయ్ కాట్ చేసి విమర్శలపాలైన సంగతి తెలిసిందే. అయితే… ఆ తప్పు మరోసారి జరగకుండా.. ఈసారి మాత్రం ప్రభుత్వాన్ని నిలదీయాలని ఫిక్స్ అయినట్లు సమాచారం.

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి – పెరుగుతున్న అప్పులు – పెన్షన్ల నిబంధనల్లో మార్పులు – అధ్వాన్నంగా ఉన్న రోడ్లు – ఆగిపోయిన అభివృద్ధి పనులు – – పెరుగుతున్న ధరలు – మూడు రాజధానుల వ్యవహారం – మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలతో పాటు ప్రతిపక్ష నేతలపై పెడుతున్న కేసులపై కూడా వైసీపీని నిలదీయాలని టీడీపీ భావిస్తోంది.

జనసేన పరోక్ష పాత్ర: ఉన్న ఒక్క ఎమ్మెల్యే వదిలిపోవడంతో.. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో జనసేన పాత్ర శూన్యం! అయితే… పాతమిత్రుడు చంద్రబాబుకు పరోక్ష సహకారం బయటనుంచే కాకుండా.. అసెంబ్లీలో ప్రస్థావించినాల్సిన అంశాలపై కూడా ఉంటుందనే అనుకోవాలి! జనసేన ఎత్తుకున్న ఏపీరోడ్ల పరిస్థితిపై కూడా అసెంబ్లీలో హాట్ డిస్కషన్స్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి… ఏపీ అసెంబ్లీలో ఈసారి జనసేన పరోక్ష పాత్ర కూడా కీలకం కాబోతుందన్నమాట.

అయితే.. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలకు గతప్రభుత్వ మూర్ఖత్వం, చేతకానితనం, దూరదృష్టిలోపాలే కారణం అని చెబుతున్న ఏపీ సర్కార్… చంద్రబాబు పట్టబోయే పట్లపై ఏమేరకు ప్రతిస్పందిస్తుంది.. బాబు పట్టుకు చిక్కుతుందా, లేక తిరిగి బాబు పనేపడుతుందా అన్నది వేచి చూడాలి! ఏది ఏమైనా… ఈసారి ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గానే జరగబోతున్నాయి!

Read more RELATED
Recommended to you

Latest news