బాబు రోడ్డెక్కకుండా ఇలా అడ్డుకుంటే ఎలా జగన్ ?

ఏపీలో చిత్ర విచిత్రమైన రాజకీయ పరిస్థితులు ఎన్నో నెలకొంటున్నాయి. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి ఏ విషయంలోనూ అవకాశం దొరకకుండా అధికార పార్టీ వైసిపి ముందుకు వెళ్తున్న తీరుపై ప్రజల్లోనూ చర్చ జరుగుతోంది. గత కొంతకాలంగా టిడిపి అధినేత చంద్రబాబు హైదరాబాద్ లోని తన నివాసానికి పరిమితం అయిపోయారు. వాస్తవంగా బాబు ఇక ఇంటికే పరిమితమైపోవాల్సిన సమయం వచ్చేసింది. ఈ సమయంలో తాను యాక్టివ్ గా ఉండలేను అని తెలిసే, పార్టీలో పెద్ద ఎత్తున కమిటీల పేరుతో నాయకులు అందరికీ పదవులు ఇచ్చేశారు. రోడ్డెక్కి వైసిపి ప్రభుత్వంపై పోరాటం చేయడమే వారి ప్రధాన విధి అని బాబు సైతం ఒక అంచనాకు వచ్చేశారు.
ఇక వారు పోరాటం మొదలు పెడితే తాను కూడా ముందుండి ఆ పోరాటంలో పాల్గొని,  పార్టీ నేతల్లో ఉత్సాహం తీసుకొద్దామని చూస్తున్నా, ఆ అవకాశం లేకుండా జగన్ ముందుచూపుతో వ్యవహరిస్తుండడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది.మొన్నటి వరకు అమరావతి వ్యవహారంపై పెద్దఎత్తున టిడిపి ఉద్యమించింది. ఎంతకాలం దీనిపై పోరాటం చేసిన ప్రభుత్వం వెనక్కి తగ్గేలా కనిపించకపోవడం వంటి వ్యవహారాలతో పాటు, ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా లోని జిల్లాలు ఈ వ్యవహారంపై పార్టీపై వ్యతిరేకత వస్తుండటాన్ని గుర్తించి, ఇప్పుడు టిడిపి జాగ్రత్త పడుతున్నట్టుగా వ్యవహరిస్తోంది. అలాగే పోలవరం ప్రాజెక్టు పైన ఇదే తరహాలో రాద్ధాంతం చేద్దామని ప్రయత్నిస్తోంది.
అసలు పోలవరం 70 శాతం తమ హయాంలోనే పూర్తి అయిందని , వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు శాతం పనులు మాత్రమే పూర్తి చేసిందని టిడిపి చెప్పుకునే ప్రయత్నాలు చేస్తోంది. దీనిపైన ఏదో ఒక రాద్ధాంతం చేద్దాం అని చూస్తూ వైసీపీ ప్రభుత్వం హాయం లో పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదు అనే విషయాన్ని హైలెట్ చేస్తూ ఉండగా,  వైసిపి ప్రభుత్వం మాత్రం  2022 ఖరీఫ్ కి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి, పోలవరం  కాలువల ద్వారా సాగునీరు అందిస్తామని హామీ ఇస్తోంది.
ఈ మేరకు 2021 నాటికి దీనిని పూర్తి చేస్తామని పోలవరం కాంట్రాక్టర్ మెగా సంస్థ ధీమా గా చెబుతోంది. ఇక టిడ్కో ఇళ్ల వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి లబ్ధిదారులతో ధర్నాలు చేయించి , దౌర్జన్యంగా వారు గృహ ప్రవేశం చేసే విధంగా టిడిపి రెచ్చగొట్టాలని ప్రయత్నించినా, ప్రభుత్వం మాత్రం వారికి డిసెంబర్ 25 లోపు ఇళ్లను కేటాయిస్తామని, కోర్టు ఇబ్బందులు ఉన్న చోట మాత్రం మినహాయింపు అని ప్రకటించింది. దీంతో ఇక్కడా టిడిపికి నిరాశే ఎదురయింది.ఇలా అన్ని విషయాలలోనూ టిడిపి కి నిరాశే ఎదురవుతూ వస్తోంది.
-Surya