ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో అనూహ్యమైన.. ఇప్పటి వరకు ఎవరూ ఊహించని విషయంపై నేతలు గుసగుసలాడుతున్నారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి.. ఈ వారంలో ఒకరోజు.. పొద్దు పొద్దున్నే.. నిద్రలేవడంతోనే ఒక ఆసక్తికర పనిచేశారు. నిజానికి.. ఈ విషయం తెలిసిన వెంటనే టీడీపీ సీనియర్లు సైతం తెల్లబోయారు. అదేంటి.. కోడి కూడా కూయకముందే.. మా బాబు.. లేఖ రాశారు! అని నోరెళ్లబెట్టారు. నిజానికి ఇదో చిత్రమైన ఘటన. సాధారణంగా.. ఇటీవల కాలంలో జగన్ సర్కారుకు లేఖలు రాస్తున్నారు చంద్రబాబు. విషయం ఏదైనా.. ఆయన .. ముఖ్యమంత్రిని కోట్ చేస్తూ.. అనేక విషయాలను చర్చిస్తున్నారు.
ఈ క్రమంలో అగ్రి గోల్డ్ బాధితులు, అమరావతి మహిళలు, ఎస్సీ, ఎస్టీలపై దాడులు.. తన పార్టీ నేతలపై కేసులు.. ఇలా అనేక అంశాలను ప్రస్తావిస్తూ.. చంద్రబాబు.. జగన్‌కు లేఖలు సంధిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఎప్పుడు లేఖరాసినా.. అది మధ్యాహ్నం 1-4 గంటల మధ్య ఉంటుంది. ఇక, మీడియాలోనే అప్పుడే బ్రేకింగ్‌గా వస్తుంది. కానీ, చంద్రబాబు.. ఇటీవల పొద్దు పొద్దున్నే అంటే.. ఉదయం 6 గంటలకే లేఖ సంధించారు. ఖఛ్చితంగా ఉదయం 6 గంటలకే రాసిన చంద్రబాబు లేఖను ఆయన అనుకూల వర్గం మీడియాలో బ్రేకింగ్ ఐటెంగా కూడా ప్రచారం కల్పించారు.
దీంతో టీడీపీలో ఈ ఘటన ఆసక్తిగా మారింది. ఇంత పొద్దున్నే చంద్రబాబు లేఖ రాయడం ఏంటని చర్చించుకున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే.. రైతులకు సంబంధించిన ధాన్యం కొనుగోళ్ల సొమ్ములను ప్రభుత్వం ఇవ్వడం లేదని.. ఇప్పటికైనా బకాయిలు చెల్లించాలని.. ప్రభుత్వమే ధాన్యం కొనాలని.. కోరడమే ఇతమిత్థంగా చంద్రబాబు లేఖ సారాంశం. అయితే.. ఇంత హడావుడిగా ఎందుకు రాయాల్సి వచ్చింది ? అనేది కీలక ప్రశ్న. దీనికి ప్రధాన కారణం.. ఆయనను ఒక కీలక అధికారి తప్పుదోవ పట్టించడమేనని తెలిసింది. ఈ రోజు మధ్యాహ్నమే… ప్రభుత్వం రైతులకు బకాయిలు చెల్లిస్తోందని.. సదరు చంద్రబాబు ఉప్పు తిన్న అధికారి ఒకరు సమాచారం చేరవేశారట.
దీంతో బాబు రాత్రికి రాత్రి పెన్ను పట్టుకుని లేఖ సంధించారు. దీంతో తెల్లారేసరికి అది వైరల్ అయింది. రైతులకు అన్యాయం చేస్తున్నారని కూడా ఈ లేఖలో విమర్శించారు. కట్ చేస్తే.. అదే రోజు కనుక రైతులకు నిధులు ఇచ్చినట్టయితే.. ఈ ఎఫెక్ట్.. అంతా కూడా తన లేఖ వల్లే సాకారం అయిందని.. జగన్ మెడలు వంచి.. రైతులకు డబ్బులు ఇప్పించానని చెప్పుకొనేందుకు.. చంద్రబాబుకు అవకాశం ఉండేది. కానీ, ప్రభుత్వం మాత్రం ఈ విషయాన్ని వాయిదా వేసింది. దీనికితోడు సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. దీంతో మొత్తంగా అనుకున్నది ఒక్కటి .. అయింది ఒకటి అన్నట్టుగా బాబుకు అనుభవం అయిందని అంటున్నారు పరిశీలకులు.