‘కాక’ పుట్టిస్తున్న బండి ‘రూట్’..!

తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దూకుడుగా పనిచేస్తున్న బండి..తన పాదయాత్ర ద్వారా మరింత ఎఫెక్టివ్ గా ప్రజల్లోకి వెళుతున్నారు. ఇక పాదయాత్ర వల్ల బీజేపీకి మైలేజ్ పెరిగింది. ఇప్పటికే నాలుగు విడతలుగా పాదయాత్ర జరిగింది..ఈ నాలుగు విడతలు విజయవంతంగా పాదయాత్ర జరిగింది. ఇక ఇప్పుడు ఐదో విడత పాదయాత్ర చేయడానికి బండి సిద్ధమవుతున్నారు.

అక్టోబర్ 15 నుంచి ఐదో విడత పాదయాత్ర మొదలు కానుంది. ఇటీవల ముగిసిన నాల్గవ విడత పాదయాత్ర మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో జరిగిన విషయం తెలిసిందే. అప్పుడు ఎలాంటి అలజడి రేగలేదు. కానీ మూడో విడత మొదలైనప్పుడు బీజేపీ-టీఆర్ఎస్ శ్రేణుల మధ్య రచ్చ జరిగింది. అయితే ఇప్పుడు ఐదో విడత పాదయాత్రని అల్లర్లకు కేరాఫ్ అడ్రెస్‌గా ఉన్న భైంసాలో మొదలు కానుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని భైంసా నుంచి కరీంనగర్ వరకు బండి యాత్ర సాగనుంది.

ఈ నెల 15న బాసరలోని సర్వస్వతి అమ్మవారిని దర్శించుకుని అక్కడ నుంచి భైంసాకు చేరుకుని..అక్కడ నుంచి యాత్ర మొదలు కానుంది. మామూలుగానే భైంసాలో హిందువులు వర్సెస్ ముస్లింలు అన్నట్లు గొడవలు జరుగుతూ ఉంటాయి. గతంలో పలుమార్లు రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి..కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. పైగా బీజేపీ అంటేనే హిందుత్వ ముద్ర కలిగిన పార్టీగా ఉంది. మరి అలాంటప్పుడు బండి యాత్ర సందర్భంగా భైంసాలో ఎలాంటి రచ్చ చెలరేగుతుందో అని పోలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

పైగా టీఆర్ఎస్..బీజేపీపై బాగా కసితో ఉంది..ఇలాంటి సమయంలో టీఆర్ఎస్ రాజకీయం ఎలా ఉంటుందనేది కూడా చూడాలి. ఇక ఐదో విడత పాదయాత్రని భైంసా నుంచి భారీ స్థాయిలో నిర్వహించాలని బండి సిద్ధమవుతున్నారు. మరి చూడాలి భైంసాలో బండి యాత్ర సజావుగా సాగుతుందో లేదో.