భట్టిని కూడా లాగుతున్నారా?

తెలంగాణ రాష్ట్రంలో జంపింగులు కొనసాగుతున్నాయి…ఇటీవల టీఆర్ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగగా, ఇప్పుడు బీజేపీలోకి కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు వస్తున్నారు. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమైంది. అటు టీఆర్ఎస్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సోదరుడు ప్రదీప్ రావు…బీజేపీలో చేరనున్నారు. ఆల్రెడీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ బీజేపీలో చేరిపోయారు. ఇంకా పలువురు నేతలు బీజేపీలో చేరడానికి రెడీగా ఉన్నారు.

ఇదే క్రమంలో పలువురు ఎమ్మెల్యేలు బీజేపీలోకి వస్తారని ప్రచారం జరుగుతుంది…అయితే ఆ ఎమ్మెల్యేలు ఎవరు అనేది ఇంకా క్లారిటీ రావడం లేదు. ఇదే సమయంలో కరుడుకట్టిన కాంగ్రెస్ వాదిగా ఉన్న సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క కూడా కాంగ్రెస్ పార్టీని వీడబోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. అసలు భట్టి కాంగ్రెస్ ని వదలడం ఏంటి అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. భట్టి కాంగ్రెస్ ని వదలడం జరిగే పని కాదు. ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీకి నిస్వార్ధంగా సేవ చేస్తున్న భట్టి…కాంగ్రెస్ పార్టీని వీడతారా? అంటే వీడరని గట్టిగా చెప్పొచ్చు.

కానీ అదే పార్టీలో కరుడుకట్టిన కార్యకర్తగా పనిచేస్తూ వచ్చిన కోమటిరెడ్డి బ్రదర్స్ వైఖరిలోనే మార్పు వచ్చింది. ఇప్పటికే రాజగోపాల్ కాంగ్రెస్ ని వదిలారు. వెంకటరెడ్డి కూడా పార్టీ వీడొచ్చని ప్రచారం జరుగుతుంది. అలాంటప్పుడు భట్టి కూడా కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారనే ప్రచారంలో ఆశ్చర్యం లేదని విశ్లేషకులు అంటున్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా ఉన్న భట్టిని లాగితే అటు బీజేపీకైనా, ఇటు టీఆర్ఎస్ పార్టీకైనా బెనిఫిట్ ఉంటుంది…కాబట్టి భట్టిని లాగడానికి ఎవరైనా ప్రయత్నించవచ్చు. కానీ ఆయన కాంగ్రెస్ ని వదలడం అంటూ జరిగే పని కాదని తెలుస్తోంది. ‘నేనే కాంగ్రెస్‌.. కాంగ్రెస్సే నేను’ అని చెప్పి పార్టీని వీడేది లేదని భట్టి అంటున్నారు. తాను పార్టీ మారుతున్నానంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని చెబుతున్నారు. మొత్తానికైతే భట్టిపై కూడా వల వేశారని తెలుస్తోంది.