తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు టీఆర్ఎస్, బీజేపి మధ్య ఆసక్తికర పోటి నడుస్తుంది. దుబ్బాక,గ్రేటర్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం మేమే అన్న వాతావరణాన్ని ఏర్పరచడంలో బీజేపీ సక్సెస్ అయింది. మళ్లీ ఇప్పుడు సాగర్ ఉప ఎన్నిక రూపంలో మరో చాన్స్ రావడం..కాంగ్రెస్ అక్కడ బలంగా ఉండటంతో కొత్త ఆలోచన చేస్తుందట కమలదళం. అభ్యర్ధి విషయంలో రాజీపడకుండా ఏకంగా అధికారపార్టీ ఎమ్మెల్సీకే ఎర వేస్తుందన్న చర్చ జోరందుకుంది.
నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్, టీఆర్ఎస్‌తో పోలిస్తే బీజేపీకి పెద్దగా బలం లేదు. అయితే ప్రస్తుతం తెలంగాణలో తమకు అనుకూలంగా వీస్తున్న రాజకీయ పవనాలను వినియోగించుకుని నాగార్జునసాగర్‌లో ఆధిక్యత సాధించాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్‌లో గతంలో జానారెడ్డిపై పోటీ చేసి ఓడిపోయిన తేరా చిన్నపరెడ్డి బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఆయన టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. హైదరాబాద్‌లోని ఓ రహస్య ప్రదేశంలో ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి బీజేపీ ముఖ్యనేతలను కలిశారని.. నాగార్జునసాగర్ టికెట్ హామీ ఇస్తే బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు చిన్నపరెడ్డి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
సిట్టింగ్ స్థానమైన నాగార్జునసాగర్‌ను తిరిగి సొంతం చేసుకోవాలని టీఆర్ఎస్ పట్టుదలగా ఉంది. దుబ్బాక విషయంలో జరిగినట్టుగా సాగర్ విషయంలో జరగొద్దని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపున ఆ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి జానారెడ్డి బరిలోకి దిగడం ఖాయమైంది. ఇక టీఆర్ఎస్ తరపున నోముల నర్సింహయ్య కుటుంబసభ్యులకు అవకాశం ఇస్తారా లేక వేరే వారిని బరిలోకి దింపుతారా అన్నది తేలాల్సి ఉంది.
గుత్తా సుఖేందర్ రెడ్డి, తేరా చిన్నపరెడ్డి పేర్లు టీఆర్ఎస్ నుంచి ప్రముఖంగా వినిపిస్తున్నా చిన్నపరెడ్డి బీజేపీలో చేరి పోటీకి సై అంటే మాత్రం త్రిముఖ పోటీ ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే బీజేపీ నుంచి నివేదితా రెడ్డి, అంజయ్య యాదవ్ పోటిపడుతున్నా వారిద్దరు సరైన ప్రత్యామ్నాయం కాదని బీజేపీ భావిస్తుంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసరికి సాగర్ ఉపఎన్నిక మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి మాత్రం ఆ వార్తలన్నింటినీ కొట్టిపారేశారు. తనను బీజేపీ నేతలు సంప్రదించారన్న వార్తలు పూర్తిగా అసత్యమని, తనపై కుట్రతోనే ఎవరో కావాలని చేస్తున్నారంటున్నారు.