ఎమ్మెల్యే కంటే ఎంపీ బెటర్.. కమలంలో క్లారిటీ.!

-

తెలంగాణలో బిజెపి సీనియర్ల పరిస్థితి “అడ్డకత్తెరలో పోకచెక్కలా ఉంది”. బిజెపి తరఫున అసెంబ్లీ నుండి బరిలోకి దిగితే ఓటమి తప్పదని సీనియర్లు అంటున్నారు. కానీ అధిష్టానం మాత్రం సీనియర్లందరూ కచ్చితంగా బరిలో ఉండాల్సిందే అంటున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు, ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాబూరావు, లక్ష్మణ్, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తదితర సీనియర్లందరూ లోక సభ కే పోటీ చేయడానికి మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది.

ఎందుకంటే లోక్‌సభకు అయితే మోదీ ఇమేజ్ తో గెలుపు సొంతం చేసుకోవచ్చని అంటున్నారు.  బిజెపి సీనియర్లు గత ఎన్నికలలో అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి చవిచూసిన వారే. ఈసారి తెలంగాణ రాష్ట్రంలో బిజెపి బలం గతంలో కన్నా తగ్గిందని, ఈసారి పోటీ చేస్తే డిపాజిట్లు దక్కించుకోలేక పరువు పోగొట్టుకోవాల్సి వస్తుందని భయపడుతున్నారు.

ఇదే సమయంలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడైన కిషన్ రెడ్డి కూడా ఓటమి భయంతో అసెంబ్లీ పోటీకి వెనకడుగు వేస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అంబర్ పేటలో పోటీ చేస్తానని బహిరంగంగా చెబుతున్నా, లోపల మాత్రం ఓటమి భయం ఉందని సన్నిహిత వర్గాలు చెబుతున్నారు. కానీ ఇది కేవలం ప్రత్యర్ధులు సృష్టించేదే అని, ఖచ్చితంగా కిషన్ రెడ్డి గెలిచే ఛాన్స్ ఉందని పలు సర్వేలు కూడా చెబుతున్నాయి. కాకపోతే కిషన్ రెడ్డి..తన భార్యని అసెంబ్లీ బరిలో నిలబెట్టి..తాను పార్లమెంట్‌కు పోటీ చేయాలని చూస్తున్నారని తెలుస్తోంది.

అయితే బిజెపి అధిష్టానం  సీనియర్లను పోటీ చేయించడం ద్వారా మిగిలిన నియోజకవర్గాలలో ఉత్సాహం వచ్చి అందరూ పోటీ చేస్తారని, తద్వారా విజయం సాధించవచ్చు అని, ఈ ఫార్ములా తోనే పశ్చిమ బెంగాల్లో గట్టి పోటీ ఇచ్చామని, ఇప్పుడు ఈ ఫార్ములా తోనే తెలంగాణలో విజయం సాధించవచ్చని బిజెపి అధిష్టానం భావిస్తోంది. కానీ తెలంగాణలో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది.

ఇప్పటివరకు  బీజేపీ అభ్యర్థుల జాబితా మాట దేవుడు ఎరుగు కచ్చితంగా పోటీ చేసే ఒక్క అభ్యర్థి పేరు కూడా ప్రకటించలేదు. పరిస్థితి ఇలాగే ఉంటే తెలంగాణలో బిజెపి స్థానం ఏమిటో అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news