బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..ఏపీ రాజకీయాల్లో సీనియర్ నాయకులు..కొన్ని దశాబ్దాల నుంచి వారు రాజకీయాల్లో ఉన్నారు. మొదట నుంచి కాంగ్రెస్ లో పనిచేసిన వారు. వైఎస్సార్ చనిపోవడం, రాష్ట్ర విభజన జరగడం, కాంగ్రెస్ దెబ్బతినడంతో జగన్ పెట్టిన వైసీపీలోకి వచ్చారు. పెద్దిరెడ్డి 2014 ఎన్నికల ముందే వైసీపీలోకి వచ్చారు. బొత్స 2019 ఎన్నికల ముందు వైసీపీలోకి వచ్చారు.
ఇక ఎవరు ఎప్పుడొచ్చిన ఇద్దరు నేతలు మాత్రం వైసీపీ కోసం గట్టిగానే కష్టపడుతున్నారు. 2019 ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం తమ తమ జిల్లాల్లో బాగానే కష్టపడ్డారు. తమ జిల్లాల్లో వైసీపీకి భారీ ఆధిక్యం తీసుకొచ్చేలా చేశారు. పెద్దిరెడ్డి సొంత జిల్లా చిత్తూరు అనే సంగతి తెలిసిందే. ఇది టిడిపి అధినేత చంద్రబాబు సొంత జిల్లా కూడా. అందుకే ఇక్కడ వైసీపీ గెలుపుని పెద్దిరెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేశారు. చంద్రబాబుకు చెక్ పెడుతూ..జిల్లాలో అత్యధిక సీట్లు గెలిపించేలా పనిచేశారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 14 సీట్లు ఉన్నాయి..గత ఎన్నికల్లో వైసీపీ 13 సీట్లు గెలుచుకుంది. ఒక కుప్పంలో టిడిపి గెలిచింది. ఇప్పుడు కుప్పంతో సహ 14 సీట్లు గెలవాలని పెద్దిరెడ్డి టార్గెట్ గా పెట్టుకుని పనిచేస్తున్నారు. అయితే ఇప్పుడు అక్కడ టిడిపి బలపడుతుంది. మరి అలాంటప్పుడు టిడిపికి మళ్ళీ చెక్ పెట్టి పెద్దిరెడ్డి ఏ మేరకు చిత్తూరులో వైసీపీని గెలిపిస్తారో చూడాలి.
ఇటు బొత్స విజయనగరం జిల్లాలో గత ఎన్నికల్లో 9కి 9 సీట్లు వైసీపీ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు అక్కడ టిడిపి వేగంగా పుంజుకుంది. దీంతో ఈ సారి ఇక్కడ వైసీపీకి మెజారిటీ సీట్లు వచ్చేలా కనిపించడం లేదు. చూడాలి మరి టిడిపిని బొత్స ఎంతవరకు నిలువరించి..వైసీపీని గెలిపిస్తారో.