మరో ఆరు నెలల్లో ఏపీ మంత్రివర్గంలో మార్పులు జరగనున్న విషయం తెలిసిందే. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకేసారి 25 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి, ఇక అప్పుడు మంత్రులగా ఛాన్స్ దక్కనివారికి రెండున్నర ఏళ్లలో చేసే మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పిస్తానని చెప్పిన విషయం తెలిసిందే. పనితీరు బాగోని మంత్రులని పక్కనబెట్టి కొత్తవారికి ఛాన్స్ ఇస్తానని జగన్ చెప్పారు. అంటే మరో ఆరు నెలల్లో మంత్రివర్గంలో మార్పులు జరగనున్నాయి.
మంత్రుల పనితీరు, కులాలు, జిల్లాల సమీకరణాల ఆధారంగా జగన్ మంత్రివర్గంలో మార్పులు చేయనున్నారు. అయితే తమ పదవులని నిలబెట్టుకోవాలని మంత్రులు గట్టిగానే ట్రై చేస్తున్నారు. అలాగే మంత్రులుగా ఛాన్స్ కొట్టేయాలని పలువురు ఎమ్మెల్యేలు చూస్తున్నారు. ఈ క్రమంలోనే మొదట నుంచి వైసీపీకి అండగా ఉన్న నరసాపురం ఎమ్మెల్యే ముదునూరు ప్రసాద్ రాజు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులకు మంత్రి పదవులు ఖాయమైపోయాయని ప్రచారం జరుగుతుంది.
గతంలో ఈ ఇద్దరు నాయకులు జగన్ కోసం తమ ఎమ్మెల్యే పదవులని సైతం త్యాగం చేశారు. 2009లో కాంగ్రెస్ తరుపున నరసాపురం ఎమ్మెల్యేగా గెలిచిన ప్రసాద్ రాజు, వైఎస్సార్ మరణం తర్వాత జగన్ పెట్టిన వైసీపీలోకి వచ్చేశారు. కాంగ్రెస్కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. కానీ 2012లో జరిగిన నరసాపురం ఉపఎన్నికలో వైసీపీ తరుపున నిలబడి ఓటమి పాలయ్యారు.
ఇక 2014 ఎన్నికల్లో ఆచంట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2019లో మళ్ళీ నరసాపురం బరిలో నిలిచి గెలిచారు. ఇలా జగన్ కోసం త్యాగం చేసిన ప్రసాద్ రాజుకు నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ దక్కడం ఖాయమని వైసీపీ వర్గాల్లో ప్రచారం నడుస్తుంది.
అటు రైల్వే కోడూరు ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులుకు సైతం కేబినెట్ బెర్త్ ఫిక్స్ అయిందని తెలుస్తోంది. శ్రీనివాసులు సైతం 2009లో కాంగ్రెస్ తరుపున రైల్వే కోడూరులో పోటీ చేసి గెలిచారు. ఇక వైఎస్సార్ మరణం తర్వాత కాంగ్రెస్కు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేశారు. దీంతో 2012 ఉపఎన్నికలో కోడూరు నుంచి వైసీపీ తరుపున నిలబడి గెలిచారు. ఇక 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఇలా నాలుగు సార్లు గెలిచిన కోరుముట్లకు సైతం జగన్ కేబినెట్ బెర్త్ ఖాయం చేశారని టాక్. మొదటి విడతలోనే ఈయనకు పదవి రావాల్సి ఉండగా, చివరి నిమిషంలో సామాజికవర్గాల సమీకరణాల్లో భాగంగా పదవి మిస్ అయింది. కానీ ఈ సారి మాత్రం బెర్త్ ఫిక్స్ అని సమాచారం.