హుజూరాబాద్‌లో హోరాహోరీ.. కానీ క్లారిటీ వచ్చేసింది?

-

గత ఆరు నెలలుగా ఒక మినీ యుద్ధంగా జరిగిన హుజూరాబాద్ ఉపఎన్నిక ముగిసింది. మొదట నుంచి ఈ ఉప పోరు కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్‌గానే నడుస్తూ వచ్చింది. ఇక ఎన్నిక సమయంలో కూడా అదే రుజువైంది. అసలు హుజూరాబాద్ ప్రజలు పార్టీని చూడలేదు…అయితే కేసీఆర్ వైపు లేదంటే ఈటల వైపుకు వెళ్ళిపోయారు. అంటే కేసీఆర్ వైపు ఉంటే టీఆర్ఎస్‌కు, ఈటల వైపు ఉంటే బీజేపీకి ఓట్లు గుద్దేశారు.

Huzurabad | హుజురాబాద్
Huzurabad | హుజురాబాద్

అయితే హుజూరాబాద్ ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లు వేయడానికి వచ్చి….సరికొత్త రికార్డుని సృష్టించారు. గత ఎన్నికలు అంటే 2018 ఎన్నికల్లో హుజూరాబాద్‌లో 84 శాతం పోలింగ్ నమోదైంది. కానీ ఈ సారి దాని కంటే ఎక్కువగా అంటే 86.57 శాతం పోలింగ్ నమోదైంది. అంటే హుజూరాబాద్ ప్రజలు ఓటు వేయడానికి ఎంత ఆసక్తి చూపించారో అర్ధమవుతుంది. మరి ఓటింగ్ ముగిసింది…ఇక ఈ ఉత్కంఠ పోరులో ఎవరు గెలుస్తారనే అంశంపై కూడా దాదాపు క్లారిటీ వచ్చినట్లే కనిపిస్తోంది.

పోలింగ్ ముగియగానే వరుసపెట్టి ఎగ్జిట్ పోల్స్ వెలువడిన విషయం తెలిసిందే. అయితే ఎగ్జిట్ పోల్స్…వన్ సైడ్‌గా మాత్రం లేవు. కొన్ని ఏమో టీఆర్ఎస్ గెలుస్తుందని చెబితే, కొన్ని బీజేపీ గెలుస్తుందని చెప్పాయి. కానీ వీరి మధ్య ఎక్కువ ఓట్ల శాతం తేడా ఉండదని కూడా చెప్పాయి. అంటే ఎవరు గెలిచిన తక్కువ మెజారిటీలతో బయటపడతారని అర్ధమవుతుంది.

కాకపోతే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్‌ ఈటల గెలుస్తారని క్లారిటీ ఇచ్చేశాయి. అంటే కారు పార్టీ కంటే ఈటలకే ఎక్కువ ఓట్లు వస్తాయని అర్ధమవుతుంది. కాకపోతే గెలుపుపై ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. అయితే ఈ ఉప ఎన్నికలో ఈటల ఇమేజ్‌ పనిచేసిందని చెబుతున్నారు. నియోజకవర్గంలో గత శాసనభ్యుడిగా ప్రజలతో సత్సంబంధాలను కలిగి ఉండటం, ప్రజలకు సేవాభావంతో సహకరించడం వంటి అంశాలతోపాటు మంత్రివర్గం నుంచి తొలగించిన సానుభూతి పనిచేసిందని తెలుస్తోంది. అయితే హుజూరాబాద్ పోరులో మరింత క్లారిటీ రావాలంటే నవంబర్ 2 వరకు ఎదురు చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news