రేవంత్ రెడ్డికి పీసీసీ: చంద్రబాబు సెట్ చేశారా? తెరవెనుక ఏం జరిగింది?

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి ఎంపికైన విషయం తెలిసిందే. అనేక రోజుల సస్పెన్స్ తర్వాత కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ పీసీసీ బాధ్యతలు రేవంత్‌కు అప్పగించారు. చాలామంది సీనియర్లు పీసీసీ రేసులో ఉన్నా సరే అధిష్టానం మాత్రం రేవంత్ వైపే మొగ్గుచూపింది. ఇక రేవంత్‌కు పీసీసీ ఇవ్వడంతో పలువురు కాంగ్రెస్ సీనియర్లు అసంతృప్తితో ఉన్నారు. పలువురు రాజీనామా బాటపట్టారు.

ఇక మొన్నటివరకు పీసీసీ తనకే వస్తుందని ఆశపడ్డ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే, రేవంత్‌కు పీసీసీ ఇవ్వడంపై సంచలన వ్యాఖ్యలే చేస్తున్నారు. టీపీసీసీ కాస్త టీడీపీ పీసీసీగా మారిందని, ఓటుకు నోటు మాదిరిగా.. నోటుకు పీసీసీని అమ్మేశారని ఆరోపించారు. ఇక తాను ఎంపీగానే పార్లమెంట్ పరిధిలో పనిచేస్తానని, గాంధీ భవన్ మెట్లు కూడా తొక్కనని చెప్పేశారు.

అయితే కోమటిరెడ్డి వ్యాఖ్యలపై రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే రేవంత్‌కు పీసీసీ దక్కడం వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారనే వాదనలు కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. ఎందుకంటే గతంలో రేవంత్ టీడీపీలో పనిచేసి వచ్చారు. అక్కడ ఏ స్థాయిలో ఫాలోయింగ్ తెచ్చుకున్నారో అందరికీ తెలుసు. అలాగే రేవంత్, చంద్రబాబుల మధ్య ఎలాంటి అనుబంధం ఉందో అందరికీ తెలుసని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.

ఇక టీడీపీ నుంచి బయటకొచ్చాక కూడా రేవంత్, బాబుని ఒక్క మాట అనలేదు. అలాగే చంద్రబాబు సైతం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. పార్టీ మారినా సరే బాబుతో రేవంత్ బంధం కొనసాగుతూనే వచ్చిందని, 2018 తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి రేవంత్-బాబుల మధ్యన ఉన్న బంధం కూడా ఒక కారణమని అంటున్నారు. అందుకే కాంగ్రెస్‌లో ముందు నుంచి కొందరు సీనియర్లు, రేవంత్‌ని తీవ్రంగా వ్యతిరేకిస్తారని గుర్తు చేస్తున్నారు.

ఇప్పుడు రేవంత్‌కు పీసీసీ దక్కడంలో  చంద్రబాబు హ్యాండ్ కూడా ఉందని సీనియర్లు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానంతో బాబుకు సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు. అందులో భాగంగానే కోమటిరెడ్డి టీపీసీసీ కాస్త టీటీడీపీ అయిందని మాట్లాడుతున్నారని చెబుతున్నారు. మరి రేవంత్‌కు పీసీసీ ఇవ్వడంపై తెరవెనుక ఏం జరిగిందో కాంగ్రెస్ అధిష్టానానికే తెలియాలి అని అంటున్నారు.