ఏపీలో ప్రతి 50 ఇండ్లకు ఒక వాలంటీర్‌ను ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజల ఇండ్లకే డోర్ డెలివరీ చేస్తామని సీఎం జగన్ అన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వైసీపీ అభిమానుల కోలాహలం నడుమ ఏపీ సీఎంగా ప్రమాణం చేసిన వైఎస్ జగన్.. రాష్ట్రంలో తాను చేయబోయే కార్యక్రమాల గురించి వివరించారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం జగన్ తన ఉపన్యాసాన్ని ప్రారంభించగానే సీఎంగా తన తొలి సంతకాన్ని వైఎస్సార్ పెన్షన్ పథకంపై చేశారు. ఈ పథకం కింద రానున్న 3 ఏళ్లలో వృద్ధులకు నెలకు రూ.3వేల వరకు ఫించన్ అందిస్తామని జగన్ తెలిపారు.
అలాగే ఏపీలో ప్రతి 50 ఇండ్లకు ఒక వాలంటీర్‌ను ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజల ఇండ్లకే డోర్ డెలివరీ చేస్తామని సీఎం జగన్ అన్నారు. ఈ క్రమంలో ఆగస్టు 15వ తేదీ నాటికి 4 లక్షల మందిని గ్రామ వాలంటీర్లుగా నియమిస్తామని, వారికి నెలకు రూ.5వేల జీతం ఇస్తామని జగన్ తెలిపారు. అలాగే ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసి అందులో 10 మందికి ఉద్యోగాలను ఇస్తామని కూడా జగన్ తెలిపారు. వారు గ్రామ వాలంటీర్‌లతో కలసి ప్రభుత్వ పథకాలను ప్రజలకు ఇంటికే చేరేట్లు చూస్తారని జగన్ తెలిపారు.
అవినీతికి తావు లేని స్వచ్ఛమైన పాలనను అందిస్తామని జగన్ అన్నారు. అక్టోబర్ 2 నాటికి గ్రామ సచివాలయాల ఏర్పాటు పూర్తి చేసి సీఎం పేషీలోనే ఓ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని.. ప్రజలు తమకు ఎలాంటి సమస్య ఉన్నా, ప్రభుత్వ పథకాలు సరిగ్గా అందకపోయినా, అధికారులు లంచం అడిగినా.. ఆ కాల్‌సెంటర్‌కు నేరుగా ఫోన్ చేసి తమ సమస్యను చెప్పవచ్చని జగన్ అన్నారు. అలాగే అన్ని ప్రభుత్వ పథకాలను కులాలు, మతాలు, వర్గాలు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అందిస్తామని అన్నారు. ఇక ఎవరైనా సరే.. ఏదైనా ప్రభుత్వ పథకం కోసం దరఖాస్తు చేసుకుంటే కేవలం 72 గంటల్లోనే ఆ పథకం కింద ప్రజలకు లబ్ది చేకూరేలా చూస్తామని జగన్ తెలిపారు. అలాగే తమ పార్టీకి చెందిన మ్యానిఫెస్టోలో ఉన్న నవరత్నాలను క్రమంగా అమలు చేస్తామని జగన్ తన ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం బహిరంగంగా ప్రజలకు తెలిపారు.