కరెక్ట్ టైమ్‌లో ‘బీసీ’ కార్డు… ఈటల కోసమేనా?

ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి పనిచేసినా…ఈ పథకం అమలు చేసినా అది కేవలం ఈటల రాజేందర్‌కు చెక్ పెట్టడానికే అన్నట్లుగా పరిస్తితి ఉంది. అసలు ఎప్పుడైతే ఈటల రాజేందర్ టి‌ఆర్‌ఎస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారో అప్పటినుంచి టి‌ఆర్‌ఎస్ ప్రభుత్వంలో పూర్తి మార్పు వచ్చింది. హుజూరాబాద్ ఉపఎన్నిక ఒక్కసారిగా తెరపైకి రావడంతో అక్కడ ఈటలకు చెక్ పెట్టాలని కే‌సి‌ఆర్ ప్రభుత్వం నానా రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. హుజూరాబాద్ ప్రజలని ఆకట్టుకోవడానికి అనేక స్కీములని ఇచ్చారు.

etela-rajender | ఈట‌ల‌ రాజేందర్
etela-rajender | ఈట‌ల‌ రాజేందర్

కొత్తగా దళితబంధు పేరిట భారీ పథకాన్ని అమలు చేస్తున్నారు. అయితే ఇదంతా ఈటలని ఓడించడానికి క్లియర్ కట్‌గా అర్ధమవుతుంది. అసలు ఎక్కడకక్కడ కే‌సి‌ఆర్….తన వ్యూహాలని అమలు చేస్తూనే ఉన్నారు. కులాల వారీగా పథకాలు, పనులు చేస్తున్నారు. అయితే ఇదే క్రమంలో తాజాగా కే‌సి‌ఆర్….బి‌సి కార్డు మరింత ఉపయోగించుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఎలాగో హుజూరాబాద్‌లో సగం మంది ఓటర్లు బీసీలే. అటు ఈటల బి‌సి అభ్యర్ధి. అందుకే టి‌ఆర్‌ఎస్‌లో బి‌సి అభ్యర్ధిని పెట్టారు. బి‌సిలని ఆకట్టుకోవడానికి అనేక పథకాలు అమలు చేశారు.

ఈ రెండున్నర ఏళ్లలో చేయని పనులని చేస్తున్నారు. బీసీ కమిషన్‌ చైర్మన్‌గా హుజూరాబాద్‌కు చెందిన వకుళాభరణం కృష్ణమోహన్‌ రావుని నియమించారు. ఇలా ప్రతి స్టెప్‌లోనూ బి‌సిలని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న కే‌సి‌ఆర్ తాజాగా… జనగణన-2021లో భాగంగా కులాల వారీగా బీసీల జనాభాను లెక్కించాలని కేంద్రాన్ని కోరుతూ తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ మేరకు అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

అయితే ఇంతకాలం లేనిది…ఇప్పుడు సడన్‌గా బీసీ జనాభా లెక్కలకు సంబంధించి తీర్మానం ప్రవేశపెట్టి, దాన్ని ఆమోదించి కేంద్రానికి పంపారు. ఇక దీనికి బీసీ నేతలు కే‌సి‌ఆర్‌ని పొగడ్తలతో ముంచెత్తారు. కే‌సి‌ఆర్…బి‌సి బంధువు అంటూ ప్రశంసించారు. అటు ఆర్ కృష్ణయ్య లాంటి వారు కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఇదంతా హుజూరాబాద్‌లో ఈటలని ఓడించడానికే అని అర్ధమవుతుంది. కానీ ఈ రాజకీయాలని ప్రజలు బాగా అర్ధం చేసుకుంటున్నారు. కే‌సి‌ఆర్ రాజకీయం వర్కౌట్ అవ్వలేదని హుజూరాబాద్ ఫలితం డిసైడ్ చేసే ఛాన్స్ ఉంది.