రాజగోపాల్‌ వ్యవహారం.. తెలంగాణ కాంగ్రెస్‌ ముఖ్యనేతలకు హైకమాండ్‌ పిలుపు

-

తెలంగాణ కాంగ్రెస్‌ ముఖ్యనేతలకు నేతలకు ఆ పార్టీ హైకమాండ్‌ నుంచి పిలుపొచ్చింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీని వీడతారనే ప్రచారం నేపథ్యంలో ఆ వ్యవహారంపై చర్చించేందుకు ముఖ్య నేతలను దిల్లీకి ఆహ్వానించినట్లు సమాచారం. సోమవారం సాయంత్రం 5 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో జరగనున్న సమావేశంలో పార్టీలో చేరికల అంశంతో పాటు రాజగోపాల్‌ వ్యవహారంపైనా చర్చించే అవకాశముంది.

పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్నందున ఇప్పటికే టీపీపీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దిల్లీలో ఉన్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జానారెడ్డిని సైతం దిల్లీ రావాలని సమాచారం ఇచ్చినప్పటికీ వెళ్లేందుకు ఆయన ఆసక్తి చూపనట్లు సమాచారం. ఈ పరిణామాలపై చర్చించేందుకు అవసరమైతే ఫోన్‌లో అందుబాటులో ఉంటానని జానారెడ్డి చెప్పినట్లు తెలిసింది.

కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఇప్పటికే.. సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌, రాజగోపాల్‌రెడ్డితో భేటీ అయి బుజ్జగించేందుకు ప్రయత్నించారు. అయితే నియోజకవర్గ పర్యటన తర్వాత దిల్లీకి వస్తానన్న రాజగోపాల్‌ రెడ్డి ఇప్పుడు రాలేనని.. అవసరముంటే ఫోన్‌లో అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు.

మునుగోడు అభివృద్ధి కావాలంటే రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. తన రాజీనామాతో మునుగోడు అభివృద్ధి చెందితే సంతోషమేనని వెల్లడించారు. ప్రజల అభిప్రాయం ప్రకారమే రాజీనామాపై నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలు 15 రోజుల్లో నిర్ణయం చెప్పాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news