హస్తంలో ఆగని హుజూరాబాద్ లొల్లి…రేవంత్‌ని వదిలేలా లేరుగా!

-

హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితం వచ్చి పదిరోజులు అయిపోయింది. గెలిచిన బీజేపీ రాజకీయంగా తన వ్యూహాలతో ముందుకెళుతుంది…ఓడిన టీఆర్ఎస్ సైతం బీజేపీని ఎదగనివ్వకుండా చేసేందుకు ప్లాన్ చేస్తుంది. రెండు పార్టీలు హుజూరాబాద్ విషయాన్ని మరిచిపోయాయి. కానీ కాంగ్రెస్‌లో మాత్రం హుజూరాబాద్ పంచాయితీ ఇంకా సాగుతూనే ఉంది. అసలు ఒకశాతం ఓట్లు రావడం ఏంటి అనేదానిపై రచ్చ జరుగుతూనే ఉంది.

congress
congress

అసలు ఎందుకు 3 వేల ఓట్లు మాత్రమే వచ్చాయనే అంశంపై చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఆ మ్యాటర్ వదిలేసి…ఇంకా ఎలా బలపడాలని ఆలోచించాలా? లేక ఎందుకు ఓడిపోయామని అక్కడే ఆగిపోవాలా అనేది కాంగ్రెస్ పార్టీకి పెద్దగా అవగాహన ఉన్నట్లు కనిపించడం లేదు. అసలు ఓడిపోయిన చోటే ఆగిపోతే ఇంకా ముందుకెళ్ళేది మాత్రం కష్టం. ఎలాగో రేవంత్ రెడ్డి హుజూరాబాద్ ఫలితాన్ని మర్చిపోయి, కాంగ్రెస్ శ్రేణులని ఉత్సాహపరచడానికి చూస్తున్నారు.

కానీ కాంగ్రెస్‌లో ఉన్న కొందరు నాయకులు మాత్రం హుజూరాబాద్‌ని అడ్డం పెట్టుకుని రేవంత్‌ని ఇంకా ఇరుకున పెట్టడానికే ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే హుజూరాబాద్‌లో ఓటమి గురించి నాయకులు చర్చలు చేసుకున్నారు. అంతటితో వదిలేయకుండా ఈ లొల్లిని ఢిల్లీ వరకు తీసుకెళ్లారు. ఇప్పుడు హుజూరాబాద్ పంచాయితీ ఢిల్లీలో జరగనుంది. ఎప్పుడో వచ్చిన ఫలితంపై కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు సీరియస్ అయిందటా…అందుకే రేవంత్ రెడ్డితో పాటు పలువురు నాయకులని ఢిల్లీకి పిలిచినట్లు కథనాలు వస్తున్నాయి.

ఢిల్లీలో కూడా హుజూరాబాద్ ఓటమిపై చర్చ నడుస్తుందట. ఏదో చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు, ఫలితం వచ్చిన 10 రోజుల తర్వాత..అదే ఓటమి గురించి చర్చ చేయడం వల్ల పావలా ఉపయోగం ఉండదు. ఇంకా కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకెళ్లాలనేది ఆలోచించాలి గానీ, అలా కాకుండా హుజూరాబాద్‌లో ఎందుకు తక్కువ ఓట్లు వచ్చాయనే దగ్గరే ఆగిపోతే పార్టీకే నష్టం జరుగుతుంది. అయితే రేవంత్ రెడ్డిని బుక్ చేయడానికే కొందరు నేతలు ఢిల్లీలో హుజూరాబాద్ లొల్లి పెట్టినట్లు అర్ధమవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news