రాష్ట్రం కోసం ఎన్నో అవ‌మానాలు భ‌రించా.. ఇక పోరాటం చేస్తాఃఈట‌ల‌

ఈట‌ల రాజేంద‌ర్ వ్య‌వ‌హారం ఎట్ట‌కేల‌కు క్లైమాక్స్‌కు వ‌చ్చింది. అంతా అనుకున్న‌ట్టుగానే ఈ రోజు ఆయ‌న త‌న పార్టీ ప‌ద‌వికి, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి తిరుగుబాటు జెండా ఎగరేశారు. షామీర్‌పేటలోని తన నివాసంలో ఆయ‌న మీడియా సమావేశం నిర్వ‌హించి, అనేక విష‌యాల‌ను వెల్ల‌డించారు. ఇక ఆయ‌న బీజేపీలో చేరేందుకు రెడీ అయ్యారు.

ఈ సంద‌ర్బంగా టీఆర్ ఎస్ పై, కేసీఆర్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఉద్యమం నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీలో తన పోరాటాల‌ను వివ‌రించారు. అలాగే అధిష్టానం నుంచి తనకు ఎదురైన ఇబ్బందులను మీడియా ముందు వెల్ల‌డించారు.

ఢిల్లీ ప‌ర్య‌ట‌న అనంత‌రం ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గ అనుచరులతో భేటీ అయి టీఆర్ ఎస్ పార్టీకి, త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంపై అభిప్రాయాల‌ను కోరారు. వారి నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఈట‌ల వారిని ఒప్పించి మ‌రీ బీజేపీలో చేరేందుకు రెడీ అయ్యారు. రాష్ట్రం కోసమే తాను ఎన్నో అవమానాల‌ను భ‌రించాన‌ని, సీఎంవోలో క‌నీసం ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ ఐఏఎస్‌లు లేరని ఆరోపించారు. తాను ఎన్న‌డూ రైతుబంధును వ్య‌తిరేకించ‌లేదని, కాక‌పోతే వంద‌ల ఎక‌రాలు ఉన్న‌వారికి ఎందుక‌ని ప్ర‌శ్నించిన‌ట్టు స్ప‌ష్టం చేశారు. ఇంకా ఆయ‌న ప్రెస్‌మీట్ కొన‌సాగుతూనే ఉంది.