ఏపీ ఎన్నికల పోలింగ్‌లో విజయవాడ పటమట పోలింగ్ కేంద్రంలో పవన్ ప్రవర్తించిన తీరు కూడా విచిత్రంగా ఉందంటూ.. ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పవన్ కల్యాణ్.. నిజానికి జనసేన పార్టీతోనే ఆయన రాజకీయాల్లోకి రాలేదు. తన అన్న మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడంతో ప్రముఖ పాత్ర పోషించింది పవన్ కల్యాణే. ప్రజారాజ్యం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించిన పవన్.. తర్వాత ప్రజారాజ్యానికి దూరమయ్యారు. 2009 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత చిరంజీవి కూడా పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి చేతులు దులుపుకున్నారు. పార్టీ నామరూపం లేకుండా పోయింది.
తర్వాత జనసేన పార్టీ పెట్టిన పవన్ ముందు నుంచి వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నారు. కేవలం ముఖ్యమంత్రి అనే పదవి కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని ముందు చెబుతూ వచ్చారు. తర్వాత ఎన్నికల ప్రచారం సమయంలో కాబోయే ముఖ్యమంత్రిని నేనే అంటూ ప్రసంగాలు ఇచ్చారు.
సరే.. దాన్ని అలా వదిలేస్తే.. ఆయన చేసే ప్రసంగాల్లో క్లారిటీ ఉండదని ఆయన అభిమానులే చెబుతున్నారు. అంతే కాదు.. ఆయన మాట్లాడేటప్పుడు ఊగిపోవడం, ఆవేశ పడటం లాంటివి చేయడం వల్ల అభిమానులు కనెక్ట్ అయి ఉంటారు కానీ.. సామాన్య జనాలకైతే అసలు పవన్ ఏం చేస్తున్నారని నెత్తి గోక్కోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే.. రాజకీయ నాయకుడు అనేవాడు ముందుగా సామాన్య జనాలకు కనెక్ట్ అవ్వాలి. కానీ.. పవన్ తన అభిమానులకు తప్పితే సామాన్య జనాలకు కనెక్ట్ అయ్యారా? అంటే దానికి సమాధానం మాత్రం దొరకడం లేదు.
ఏపీ ఎన్నికల పోలింగ్‌లో విజయవాడ పటమట పోలింగ్ కేంద్రంలో పవన్ ప్రవర్తించిన తీరు కూడా విచిత్రంగా ఉందంటూ.. ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా ఓటింగ్ సమయంలో సినీ ప్రముఖులయినా.. రాజకీయ ప్రముఖులయినా లైన్‌లో నిలబడి ఓటు వేసి వెళ్తారు. నిన్న చాలా మంది ప్రముఖులు కూడా అలాగే లైన్‌లో నిలబడి ఓటేశారు. కానీ.. పవన్ మాత్రం తన సెక్యూరిటీ సిబ్బందితో వచ్చి.. లైన్ ఉన్నా అదేమీ పట్టించుకోకుండా వెళ్లి ఓటేసి వచ్చారు. దీనిపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి.
గతంలో పవన్ అన్నయ్య చిరంజీవి కూడా ఇలాగే 2014 ఎన్నికల్లో క్యూలో నిలబడకుండా ఓటేసి వచ్చారు. పెద్ద క్యూ ఉన్నా అదేమీ పట్టించుకోకుండా చిరంజీవి ఓటేసి రావడం అప్పట్లో విమర్శలకు దారి తీసింది. తర్వాత చిరంజీవి క్షమాపణలు కూడా చెప్పారు. ఇప్పుడు పవన్ కూడా సేమ్ టు సేమ్ అన్న లాగానే క్యూను పట్టించుకోకుండా ఓటేసి వచ్చారు.
అయితే.. దీనిపై స్పందించిన జనసేన… ఓటింగ్ కేంద్రం వద్ద పవన్ నిలబడితే అక్కడ జనాలు గుమికూడతారని.. సెల్ఫీల కోసం ఎగబడతారని.. దాని వల్ల పోలింగ్ కేంద్రం వద్ద లేనిపోని సమస్యలు ఉత్పన్నమవుతాయని.. అయినప్పటికీ పవన్ పోలింగ్ కేంద్రం వద్ద కాసేపు వెయిట్ చేశారని.. అప్పటికే అక్కడ జనాలు గుమికూడటంతో వెంటనే పవన్ లోపలికి వెళ్లి ఓటేసి వెళ్లిపోయారని సర్ది చెబుతున్నారు. కానీ.. ఎంత సర్ది చెప్పినా.. పవన్ అలా చేసి ఉండకూడదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అప్పుడు అన్న.. ఇప్పుడు తమ్ముడు.. ఇద్దరూ ఒకేరకమైన తప్పు చేసి అడ్డంగా ఇరుక్కున్నారని అంటున్నారు.