తెలంగాణ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటివరకు తెలంగాణ రాజకీయాలు స్తబ్ధుగానే ఉన్నాయి. కానీ బీజేపీ అనూహ్యంగా పుంజుకోవడం, దివంగత వైఎస్సార్ తనయురాలు షర్మిల (Sharmila) తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం, అటు కేసీఆర్‌కు మొన్నటివరకు కుడిభుజంగా ఉన్న ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం, రేవంత్ రెడ్డికి టీపీసీసీ పదవి దక్కడం అలాంటి అంశాలు చాలా ఆసక్తికరంగా మారాయి.
ఈ పరిణామాలతో తెలంగాణ రాజకీయాలు బాగా వేడెక్కాయి. అయితే మొన్నటివరకు తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్-బీజేపీలు నువ్వా-నేనా అన్నట్లు తలపడుతున్నాయి. ఇక ఇప్పుడు టీపీసీసీ పీఠం రేవంత్‌కు దక్కడంతో కాంగ్రెస్ ఒక్కసారిగా రేసులోకి వచ్చింది. పీసీసీ అధ్యక్షుడుగా అదిరిపోయే వ్యూహాలతో ముందుకెళ్లాలని రేవంత్ చూస్తున్నారు. ఈ క్రమంలోనే అన్నీ పార్టీల రాజకీయ ఎత్తుగడలని పరిశీలిస్తున్నారు.
ముఖ్యంగా తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టడం వెనుక కేసీఆర్ ఉన్నారని రేవంత్ భావిస్తున్నారు. ఎందుకంటే షర్మిల రాజకీయాల్లోకి వస్తే కీలకమైన రెడ్డి ఓట్లు, దళితులు, క్రిస్టియన్ ఓట్లలో చీలిక వచ్చే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్‌కు మొదట నుంచి ఈ ఓటు బ్యాంకే కీలకం. కానీ షర్మిల ఎంట్రీతో పరిస్తితి మారింది.
అలాగే ఏపీ ప్రభుత్వం ఎప్పుడో రాయలసీమ ఎత్తిపోతల పథకం మొదలుపెడితే, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం, ఏపీలో ఉన్న జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంది. తెలంగాణ మంత్రులు…వైఎస్సార్‌ని, జగన్‌ని దారుణంగా తిడుతున్నారు. కానీ ఏపీ మంత్రులు మాత్రం ఎలాంటి స్పందన ఇవ్వడం లేదు. దీని వెనుక పెద్ద కుట్ర ఉందని రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అంటే కాంగ్రెస్‌ను బలహీనపరచి షర్మిల పార్టీని బలోపేతం చేయడానికే వైఎస్‌ను టీఆర్ఎస్ టార్గెట్ చేసిందని రేవంత్ బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఇక షర్మిల సైతం కాంగ్రెస్ ఓటు బ్యాంక్‌కు డ్యామేజ్ చేసి, మళ్ళీ టీఆర్ఎస్ని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తుందని నమ్ముతున్నారు. మొత్తానికైతే షర్మిల విషయంలో రేవంత్ అలెర్ట్‌గానే ఉన్నట్లు కనిపిస్తోంది.