మొత్తానికి పవన్ కల్యాణ్ వ్యూహం బయటపెట్టారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించాలని గట్టిగా పోరాడుతున్న పవన్..అవసరమైతే పొత్తుతో ముందుకెళ్లడానికి కూడా రెడీ అయ్యారు. ఇప్పటికే చంద్రబాబు-పవన్ రెండుసార్లు కలిసిన విషయం తెలిసిందే. కాకపోతే పొత్తు గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. కానీ తాజాగా శ్రీకాకుళంలో యువశక్తి పేరిట సభ పెట్టిన పవన్..ఆ సభ వేదికగా వైసీపీని గద్దె దించే విషయంలో అవసరమైతే టీడీపీతో పొత్తుకు సిద్ధమని పరోక్షంగా చెప్పుకొచ్చారు.
ఇక ఎప్పటిలాగానే వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడిన పవన్..తాము అధికారంలోకి వస్తే ప్రజలకు అండగా ఉంటామని అన్నారు. అలాగే తనని తిడుతున్న వైసీపీ మంత్రులకు అదే స్థాయిలో కౌంటర్లు ఇచ్చారు. చివరికి ఒంటరిగా వెళ్ళి వీర మరణం పొందాలని అనుకోవడం లేదని, కానీ ప్రజలు అండగా ఉంటామంటే ఒంటరిగా వెళ్లడానికి రెడీ అని..కానీ ఇప్పుడు ఆ పరిస్తితి కనిపించడం లేదని, ఇప్పుడు అండగా ఉంటామని చెబుతారు గాని, ఎన్నికల సమయం వచ్చేసరికి మా కులం అన్న, మా అమ్మ చెప్పిందన్న అని చెప్పి వైసీపీ వాళ్ళకు ఓటు వేస్తున్నారని, అందుకే ఈ సారి రిస్క్ చేయదలుచుకోలేదని పవన్ చెప్పేశారు.
అంటే టీడీపీతో పొత్తుకు దాదాపు రెడీగా ఉన్నారని తెలుస్తోంది. అయితే తమ గౌరవం తగ్గకుండా ఉండేలాగానే పొత్తు ఉంటుందని, గౌరవం తగ్గుదనుకుంటే ఒంటరిగా పోటీ చేయడానికి రెడీ అని పవన్ చెప్పుకొచ్చారు. కానీ పరిస్తితి చూస్తే చంద్రబాబుతో కలిసే పవన్ ఓ పక్కా వ్యూహం ప్రకారం జగన్కు చెక్ పెట్టడానికి ముందుకెళుతున్నారని అర్ధమవుతుంది.
అయితే పొత్తులో జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయి..టీడీపీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందనేది క్లారిటీ రాలేదు. ఈ అంశం వచ్చే ఎన్నికల ముందే తేలేలా ఉంది. కానీ చంద్రబాబు-పవన్ కలిసి వెళ్ళడం మాత్రం ఫిక్స్ అయిందని చెప్పవచ్చు. మరి వీరి పొత్తు ద్వారా జగన్కు ఏ మేర చెక్ పెట్టగలరో చూడాలి.