అప్పుడే ఈటల సంచలన నిర్ణయం ఉంటుందా?

-

తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు ఈటల రాజేందర్ చుట్టూనే తిరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. మొన్నటివరకు ఈయన అధికార టీఆర్ఎస్‌లో సీఎం కేసీఆర్ కుడి భుజంగా ఉండేవారు. రెండు దశాబ్దాలుగా టీఆర్ఎస్‌లో ఉంటూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఇక తెలంగాణ రావడం, టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో కేసీఆర్ క్యాబినెట్‌లో మంత్రిగా కొనసాగుతున్నారు. ఇక రెండోసారి క్యాబినెట్‌లో కొనసాగుతున్న ఈటలపై అనూహ్యంగా భూకబ్జా ఆరోపణలు రావడం, వాటిపై కేసీఆర్ విచారణ చేయించడం, ఈటలని మంత్రివర్గం నుంచి తప్పించడం, ఈటల టీఆర్ఎస్‌ని వీడి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం జరిగిపోయాయి.

etela-rajender | ఈట‌ల‌ రాజేందర్
etela-rajender | ఈట‌ల‌ రాజేందర్

అయితే టీఆర్ఎస్ వీడాక ఈటల కాంగ్రెస్, బీజేపీ నేతలతో కొన్ని రోజు మంతనాలు జరిపిన విషయం తెలిసిందే. కానీ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం, రాష్ట్రంలో కూడా బీజేపీ పుంజుకునే స్థితిలో ఉండటంతో రాజేందర్ ఆ పార్టీలో చేరారు. కానీ రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యాక, తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుంటుంది. ఇక బీజేపీలో చేరి ఈటల, హుజూరాబాద్ బరిలో నిలబడ్డారు. ఇక ఈటలని ఓడించడానికి కేసీఆర్, తన అధికార బలాన్ని అంతా ఉపయోగిస్తున్నారు.

కానీ ఈటల మాత్రం తన సొంత బలాన్ని నమ్ముకుని ముందుకెళుతున్నారు. ఎందుకంటే హుజూరాబాద్‌లో బీజేపీకి అసలు బలం లేదు. పైగా బీజేపీ నేతలు హుజూరాబాద్‌లో ఈటలకు పెద్దగా సపోర్ట్‌గా నిలబడుతున్నట్లు కనిపించడం లేదు. అటు టీఆర్ఎస్ తరుపున నాయకులు మాత్రం భారీగా దిగేసి హుజూరాబాద్‌లో ప్రచారం చేస్తున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో ఈటల ఎన్నికలయ్యాక తన రాజకీయ భవిష్యత్‌పై సంచలన నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మామూలుగానే ఈటలకు కమ్యూనిజం భావజాలం ఎక్కువ. దానికి పూర్తిగా వ్యతిరేకంగా బీజేపీ సిద్ధాంతం. ఓ రకంగా చెప్పాలంటే ఈటల లాంటి నేతకు బీజేపీ సెట్ అవ్వదు. అందుకే ఎన్నికల్లో గెలిచాక ఈటల, తన నిర్ణయాన్ని మార్చుకునే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. ఎన్నికలైన వెంటనే కాకపోయిన నెక్స్ట్ ఎన్నికల ముందు పరిస్తితి బట్టి ఈటల, తన రాజకీయ భవిష్యత్‌ విషయంలో సంచలన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news