హుజూరాబాద్ ఉపఎన్నికలో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ తెలంగాణ ప్రజల్లో బాగా ఉందనే సంగతి తెలిసిందే. అసలు ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయి…ఇక్కడ ఎవరు గెలుస్తారా? అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే హుజూరాబాద్ ఉపఎన్నిక విషయంలో వచ్చే సర్వేలపై ప్రజలకు ఆసక్తి పెరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి పలు సర్వేలు బయటకొస్తున్న విషయం తెలిసిందే.
ఇక్కడ గెలుపుపై ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. సర్వేలన్నీ తనకే అనుకూలంగా ఉన్నాయని బీజేపీ నుంచి బరిలో దిగుతున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ చెబుతున్నారు. ఇక్కడ తనకు 50 శాతంపైనే ప్రజల మద్ధతు ఉందని, టీఆర్ఎస్‌కు 25 శాతం ఓట్లు కూడా రావని మాట్లాడుతున్నారు. అటు సీఎం కేసీఆర్ సైతం సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని మాట్లాడుతున్నారు.
అయితే ఇలా ఎవరికి వారు సర్వేలు తమకే అనుకూలంగా ఉన్నాయని చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవ పరిస్తితులు ఏంటి అనే విషయంపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. పార్టీల పరంగా కాకుండా ఇప్పటివరకు వచ్చిన న్యూట్రల్ సర్వేల్లో ఈటల రాజేందర్‌కే గెలిచే అవకాశాలున్నాయని తెలుస్తోంది. పైగా పలు మీడియా సంస్థలు హుజూరాబాద్‌లో తిరుగుతూ ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
ఈ క్రమంలోనే ప్రజలు, ఈటల పట్ల సానుభూతితో ఉన్నారని తెలుస్తోంది. అయితే ఆ సానుభూతిని తగ్గించడానికి టీఆర్ఎస్ కూడా గట్టిగానే ప్రయత్నిస్తుంది. అందుకనే పెద్ద ఎత్తున హుజూరాబాద్ ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ముఖ్యంగా దళితబంధుపైనే టీఆర్ఎస్ ఎక్కువ ఆశలు పెట్టుకుంది. అటు అభివృద్ధి కార్యక్రమాలకు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు.
దీంతో హుజూరాబాద్ ప్రజలు తమవైపే ఉంటారని టీఆర్ఎస్ అనుకుంటుంది. కానీ ఎన్నికల సమయం వచ్చేసరికి పరిస్తితి ఎలా ఉంటుందో చెప్పలేం. అప్పటికప్పుడు ఉండే రాజకీయాలని బట్టి కూడా ఫలితం మారిపోయే ఛాన్స్ ఉంది. ఏదేమైనా ఇక్కడ టీఆర్ఎస్, ఈటల మధ్య పోటాపోటి ఫైట్ జరగనుందని తెలుస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ మూడో స్థానానికే పరిమితం అయ్యేలా ఉంది.