బీజేపీ అధ్యక్షుడిగా ఈటెల…! రేసులో ముందున్నది ఆయనే మరి

-

మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ త్వరలోనే తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారా…అంటే అవుననే అంటున్నారు ఆ పార్టీ నేతలు.. బీఆర్ఎస్ లో సుదీర్ఘ కాలం ఉండటమే కాదు మంత్రిగా కూడా పనిచేసిన ఆయనకు రాష్ట్ర స్థితిగతులపై, రాజకీయ పరిస్థితులపై మంచి అవగాహన ఉంది.తన నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనైనా ఫాలోయింగ్ ఉన్న నాయకుడు ఆయన.సామాజికవర్గం పరంగా బీసీ కావడం కూడా ఆయనకు కలిసొచ్చే అంశం.రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటంలో కూడా తానే ముందున్నందున ఆయనకే సారధ్య బాధ్యతలు అప్పగిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన రెండుచోట్ల ఓడినప్పటికీ మల్కాజిగిరి ఎంపీ సీటు విషయంలో ఆయనకే అవకాశం కల్పించింది బీజేపీ.లోక్ సభ ఎన్నికల్లో అధిష్టానం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ ఆయన మల్కాజిగిరి ఎంపీగా గెలిచారు.

కేంద్ర‌మంత్రిగా ఉన్న ప్రస్తుత అధ్యక్షుడు కిష‌న్ రెడ్డి జాతీయ రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారు.రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టేలేనంత బిజీ షెడ్యూల్ లో ఉన్నారాయన. తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం చాలా హాట్ గా మారాయి. బీఆర్ఎస్ ను ఖాళీ చేయించే పనిలో కాంగ్రెస్ పార్టీ నిమగ్నమైంది.ఈ క్రమంలో ప్రభుత్వ తప్పిదాలపై ఆందోళనలు చేయాలన్నా నడిపించే వారు లేక బీజేపీ కేడర్ సంకోచించే పరిస్థితి ఏర్పడింది.ఇదే సమయంలో బీజేపీ అధ్యక్షుడిని ప్రకటిస్తే రాజకీయం మరింత రంజుగా మారుతుంది.రాష్ట్ర అధ్యక్ష రేసులో ఓ నలుగురి పేర్లు వినిపిస్తున్నా కిషన్ రెడ్డి స‌పోర్ట్ ఈట‌ల‌కే ఉందని సమాచారం. మ‌ల్కాజ్ గిరి టికెట్ ఈట‌లకే దక్కడం వెనుక కిషన్ రెడ్డి కృషి ఉంది.దీంతో కాబోయే అధ్యక్షుడు ఆయనే అంటూ టాక్ నడుస్తోంది.

గత లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రం నుండి 8మంది ఎంపీలు గెలిచారు. కిష‌న్ రెడ్డితో పాటు మ‌రో ఇద్ద‌రికి మంత్రి ప‌ద‌వులు వ‌స్తాయ‌ని,వారిలో బండి సంజ‌య్ తో పాటు ఈట‌ల‌కు కూడా ఉన్నారని చివ‌రి వ‌ర‌కు ప్ర‌చారం జ‌రిగింది. ప్ర‌మాణ‌ స్వీకారానికి ముందు రోజు అమిత్ షా ఈట‌ల‌ను పిలిపించి మాట్లాడ‌టంతో ఈట‌ల‌కు అధ్య‌క్ష ప‌ద‌వి ఇస్తార‌ని అంతా ఫిక్స్ అయ్యారు.అయితే ప్రకటనలో జాప్యం జరుగుతోంది.బీజేపీ జాతీయ అధ్య‌క్షుడి ఎన్నికతో రాష్ట్ర అధ్యక్ష నియామకాన్ని ముడిపెట్టడంతో అప్ప‌టి వ‌ర‌కు సైలెంట్ గా ఉండకుండా రేవంత్ సర్కారుపై ఈటెల విమర్శలు సంధిస్తున్నారు. ఆయనతో పాటు బీజేఎల్పీ నేత మ‌హేశ్వ‌ర్ రెడ్డి అప్పుడ‌ప్పుడు విమ‌ర్శ‌లు చేస్తున్నారే త‌ప్ప ఎవ‌రూ పెద్ద‌గా మాట్లాడ‌టం లేదు.రైతు రుణ‌మాఫీ, గ్రేట‌ర్ ప‌రిధిలో ఇండ్ల నిర్మాణాల కూల్చివేత స‌హ ప‌లు అంశాల్లో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయ‌టంలో ఈటెల దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఈటెలకే అధ్యక్ష బాధ్యతలు దక్కుతాయని పార్టీ నేతలు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version