హుజూరాబాద్ ఉప పోరులో గెలవడానికి అధికార టీఆర్ఎస్ ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోందో అంతా చూస్తూనే ఉన్నారు. ఇక్కడ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ని ఓడించడానికి టీఆర్ఎస్ శతవిధాలా ప్రయత్నిస్తుంది. అందుకే ఎప్పుడూలేని విధంగా సరికొత్త పథకాలని కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈటల రాజేందర్ దెబ్బకు కేసీఆర్..ప్రజలకు అనేక రకాల పథకాలు అందిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రయాలు చేస్తున్నారు. ఇక దళితబంధు పేరుతో నియోజకవర్గంలోని దళితులని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అటు రాష్ట్రంలోని టీఆర్ఎస్ నేతలంతా హుజూరాబాద్‌లో మకాం వేసి, కారు గుర్తుకు ఓటు వేయాలని తిరుగుతున్నారు.
ఇలా హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ హడావిడి చేస్తుంటే, ఈటల రాజేందర్ మాత్రం సైలెంట్‌గా తన పని కానిచ్చేస్తున్నారు. హంగులు, ఆర్భాటాలు లేకుండా, ప్రజలతో కలిసిపోతూ ముందుకెళుతున్నారు. అలాగే ఇతర పార్టీలకు చెందిన నాయకులని, కార్యకర్తలని తనవైపుకు తిప్పుకుంటూ, హుజూరాబాద్‌లో బలం పెంచుకుంటున్నారు. అయితే ఓ వైపు మామూలుగా ప్రచారం చేస్తూనే, మరోవైపు వ్యక్తిగతంగా గ్రామాల్లో ప్రజలని కలుస్తూ, తనకు మద్ధతుగా నిలబడాలని కోరుతున్నారు.
దీని కోసం భారీ సభలు పెట్టుకోకుండా, గ్రామాల్లోకి వెళ్ళిపోయి ప్రజల మధ్యలో కూర్చుని, వారిలో ఒకడిగా ఉంటూ, తనని గెలిపించాలని కోరుతున్నారు. ఇలా సైలెంట్‌గా పనిచేస్తున్న ఈటలకు బీజేపీ నేతలు కూడా బాగానే సపోర్ట్ చేస్తున్నారు. వారు కూడా ఈటల గెలుపు కోసం తిరుగుతున్నారు. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం నియోజకవర్గంలో ఎంట్రీ ఇచ్చారు. జన ఆశీర్వాద సభ పేరుతో హుజూరాబాద్‌లో ఈటలకు మద్ధతుగా ప్రచారం చేశారు.
ఈ విధంగా హుజూరాబాద్‌లో ఈటల అన్నీ వైపులా నుంచి మద్ధతు పెంచుకుంటున్నారు. పైకి టీఆర్ఎస్ నేతలు హడావిడి చేసినా, ఈటల మాత్రం సైలెంట్‌గా హుజూరాబాద్‌లో ప్రజల మద్ధతు పెంచేసుకుంటున్నారు.