నేటి రాజకీయాల్లో వ్యూహకర్తల హవా పెరిగిపోయింది..రాజకీయ పార్టీలు సొంత వ్యూహాలని నమ్ముకుని ముందుకెళ్లడం కంటే..వ్యూహకర్తలని పెట్టుకుని ముందుకెళుతున్నారు. ఈ వ్యూహకర్తల రాజకీయం వైసీపీతోనే మొదలైంది. 2014లో ఓటమితో జగన్..ప్రశాంత్ కిషోర్‌ని వ్యూహకర్తగా పెట్టుకుని 2019 ఎన్నికల్లో సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత పీకే టీంని కొనసాగిస్తున్నారు.
ఇక 40 ఏళ్ల రాజకీయ అనుభవం, రాజకీయ చాణక్యుడుగా ఉన్న చంద్రబాబు సైతం వ్యూహకర్తన పెట్టుకోవాల్సి వచ్చింది. వైసీపీని ఢీకొట్టడానికి ఆయనకు కూడా వ్యూహకర్త కావాల్సి వచ్చింది. గతంలో పీకే టీంలో పనిచేసిన రాబిన్ శర్మని వ్యూహకర్తగా నియమించుకున్నారు. ఇటు తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు సైతం వ్యూహకర్తలతోనే ముందుకెళుతున్నాయి. తెలంగాణ విషయం పక్కన పెడితే..ఇప్పుడు ఏపీలో పీకే శిష్యుల మధ్య పోరు నడుస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్తగా పనిచేయడంలేదు. ఆయన సొంతంగా రాజకీయం చేస్తూ..బీహార్ లో పాదయాత్ర చేస్తున్నారు.
కానీ ఆయన టీమ్ మాత్రం సెపరేట్ అయ్యి..వివిధ రాజకీయ పార్టీ కోసం పనిచేస్తున్నాయి. ఇదే క్రమంలో గతంలో పీకే టీంలో రిషి రాజ్, రాబిన్ శర్మలు ఇప్పుడు వైసీపీ, టీడీపీల కోసం పనిచేస్తున్నారు. పీకే వెళ్లిపోయాక వైసీపీ వ్యూహకర్తగా రిషి రాజ్ కొనసాగుతున్నారు. మళ్ళీ వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడుతున్నారు. ఇక టీడీపీకి పీకే టీంలో పనిచేసిన రాబిన్ శర్మ వ్యూహకర్తగా పనిచేస్తున్నారు.
ఈయన ఇంతవరకు తెరముందు ఉండే పనిచేశారు. తాజాగా టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో రాబిన్ శర్మ ముందుకొచ్చారు. వైసీపీ ఎమ్మెల్యేలని గడప గడపకు వెళ్ళేలా రిషి రాజు ప్లాన్ చేస్తే..దానికి కౌంటరుగా ఇదేం ఖర్మ అంటూ టీడీపీ నేతలు ప్రతి ఇంటికెళ్ళి జగన్ ప్రభుత్వం వల్ల ప్రజలు పడుతున్న బాధలు వివరించేలా రాబిన్ ప్లాన్ చేశారు. ఇలా పీకే శిష్యులు ప్రత్యర్ధులు మాదిరిగా తలపడుతున్నారు. మరి చివరికి వీరిలో ఎవరు ఎవరు గెలుస్తారో..2024 ఎన్నికల్లో తేలిపోతుంది.