తెలంగాణలో ఇప్పుడు రాజీకీయాలన్నీ హుజూరాబాద్ చుట్టూ చేరాయి. ఏ క్షణం అక్కడ ఏం జరుగుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్ని పార్టీలు రాష్ట్ర అధ్యక్షుల ఫోకస్ ఇప్పుడు ఈటల ఇలాకాపైనే ఉంది. ఈటల రాజేందర్ ఈ రోజు రాజీనామా చేస్తుండటంతో రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశం ఉంది. ఇక హుజూబాద్‌లో ఎలాగైనా గెలవాలని టీఆర్ఎస్ గట్టి పట్టుమీద ఉంది. ఇందుకోసం ఇప్పటికే పలువురి పేర్లు పరిశీలిస్తోంది.
అయితే అధికార టీఆర్ఎస్‌కు హుజూరాబాద్‌లో ఈటల తప్ప సరైన నాయకుడు లేకపోవడంతో అక్కడ అందరూ పోటీకి ముందుకొస్తున్నారు. మాకంమే మాకంటూ ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఇందులో మాజీ ఎంపీ వినోద్‌కుమార్ పేరు ఎక్కువగా వస్తోంది. అలాగే ఈయన తర్వాత కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఆయన భార్య లేదా మనువడికి టికెట్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.
వీరితో పాటు మాజీ బీసీ కమిషన్ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు కూడా పోటీలో ఉన్నారు. ఇక ప్రస్తుత టీఆర్ ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన గెల్లు శ్రీనివాస్ కూడా టికెట్ రేసులో ఉన్నారు. కాకపోతే ప్రధానంగా మాజీ ఎంపీ వినోద్ లేదా కెప్టెన్ లక్ష్మీకాంతరావు కుటుంబీకుల్లో ఎవరికైనా ఇచ్చే అవకాశం ఉంది. ఇంతకు ముందు ఇక్కడి నుంచి పోటీ చేసిన చరిత్ర కెప్టెన్ లక్ష్మీకాంతరావుకు ఉంది. అలాగే ఈ ప్రాంతంపై ఆయనకు బాగా పట్టుకూడా ఉండటంతో వారి కుటుంబీకులకే టికెట్ దక్కే ఛాన్స్ ఉంది. ఇంకోవైపు కాంగ్రెస్ ఇన్‌చార్జి పాడి కౌశిక్‌రెడ్డి నిన్న కేటీఆర్‌ను కలవడంతో ఆయన కూడా టీఆర్ ఎస్‌నుంచే పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. మరి వీరిలో ఎవరికి కేసీఆర్ వరం లభిస్తుందో చూడాలి.