ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అంటే ధర్మపురి శ్రీనివాస్ గుర్తుకు వస్తారు. ఆ జిల్లాపై ఆయన అలాంటి ముద్రవేశారు. దశాబ్దాల తరబడి కాంగ్రెస్ లో పనిచేసి సత్తా చాటారు. పిసిసి అధ్యక్షుడుగా పనిచేసి..2004లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తనవంతు కృషి చేశారు. ఇక నిజామాబాద్ జిల్లాని కాంగ్రెస్ కంచుకోటగా మార్చారు. అదే సమయంలో నిజామాబాద్ అసెంబ్లీ సీటు అంటే డి.శ్రీనివాస్ అడ్డా అన్నట్లు ఉండేది.
గతంలో ఇక్కడ కాంగ్రెస్ మంచి విజయాలు సాధించింది…డి. శ్రీనివాస్ మూడుసార్లు గెలిచారు. టిడిపి సైతం 1994లో ఒకసారి గెలిచింది. ఇక 2009లో ఇక్కడ అనూహ్యాంగా బిజేపి గెలిచింది. బిజేపి నుంచి యెండల లక్ష్మీనారాయణ గెలిచారు. 2010 ఉపఎన్నికల్లో సైతం ఆయన సత్తా చాటారు.
అయితే రాష్ట్రం విడిపోయాక తెలంగాణ వచ్చాక నిజామాబాద్ అర్బన్ స్థానంలో బిఆర్‌ఎస్ సత్తా చాటుతుంది. 2014లో బిఆర్‌ఎస్ నుంచి బిగాల గణేశ్ గుప్తా 10 వేల మెజారిటీతో ఎంఐఎంపై గెలిచారు. 2018 ఎన్నికల్లో 25 వేల మెజారిటీతో కాంగ్రెస్ పై గెలిచారు. ఈ సారి కూడా పోటీకి సిద్ధమవుతున్నారు. హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. కాకపోతే కాంగ్రెస్, బిజేపి బలపడుతున్నాయి. ఓటు బ్యాంకుని పెంచుకుంటున్నాయి. దీంతో బిగాలకు కాస్త టఫ్ ఫైట్ ఎదురుకావడం ఖాయం.
అదే సమయంలో ఎంఐఎం గత ఎన్నికల్లో పోటీ చేయకపోవడం వల్ల ఆ ఓట్లు బిఆర్‌ఎస్‌కు ప్లస్ అయ్యాయి. ఈ సారి గాని బరిలో ఉంటే బిఆర్‌ఎస్‌కు నష్టం. ఓట్లు చీలిపోతాయి. ఏదేమైనా ఈ సారి గణేశ్ హ్యాట్రిక్ కొట్టడానికి కష్టపడాలి.