బీసీ కార్డు ఎటువైపు… ఏపీలో ఆస‌క్తిగా స్థానిక ఎన్నిక‌లు…. !

-

రాష్ట్రంలో త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌బోయే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి కీల‌క ఘ‌ట్టం చోటు చేసుకుంది. ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన రిజ‌ర్వేష‌న్లు 59శాతం చెల్ల‌బోవ‌ని, 50శాతానికే క‌ట్టుబ‌డాల‌ని రాష్ట్ర హైకోర్టు తీర్పు చెప్పింది. ముఖ్యంగా బీసీల‌కు అధికంగా ప్రాధాన్యం ఇవ్వాల‌ని భావించిన జ‌గ‌న్ ప్ర‌య‌త్నానికి హైకోర్టు బ్రేక్ వేసిన‌ట్ట‌యింది. అయితే, ఈ ప‌రిణామాన్ని సంపూ ర్ణం గా రాజ‌కీయం చేసేందుకు ఇటు ప్ర‌తిప‌క్షం, అటు అధికార ప‌క్షం కూడా తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నాయ‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఇప్ప‌టికే ఈ విష‌యంపై మాట్లాడిన మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌.. ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు కుట్రతోనే వెనుకబడిన వర్గాలు రిజర్వేషన్లు కోల్పోయారని మండిపడ్డారు.

బలహీన వర్గాల ఎదుగుదలకు అడ్డుపడుతున్న చంద్రబాబు చరిత్ర హీనుడుగా మిగిలిపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి చెందిన ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారని మంత్రి వెల్లడించారు. బీసీలకు చంద్రబాబు ఇచ్చే బహుమానం ఇదేనా అని నిలదీశారు. నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లను బడుగు బలహీన మైనార్టీలకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కల్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ 59 శాతం రిజర్వేషన్లు ఉండాలని ప్రభుత్వం నిర్ణయిస్తే.. దానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారు.

చంద్రబాబు నాయుడే దగ్గరుండి టీడీపీ కార్యకర్తలతో కేసులు వేయిస్తున్నారు. ఆ పరిణామంతో టీడీపీలో ఉన్న బీసీ నేతలు సిగ్గుపడాలి.. అంటూ బొత్స వ్యాఖ్య‌లు సంధించేశారు. అధికార ప‌క్షం ఇలా అంటే.. ప్ర‌తిప‌క్షం ఊరుకుంటుందా? ఆ వెంట‌నే సీఎం జగన్‌పై టీడీపీ నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లపై కోర్టు ఇచ్చిన తీర్పును ఉద్దేశించి ట్విట్టర్‌లో జగన్‌పై విరుచుకుపడ్డారు. ఏరు దాటే వరకూ ఓడ మల్లన్న.. దాటాక బోడి మల్లన్న అన్న‌ట్టుగా బీసీల పట్ల జగన్ సవతి ప్రేమ చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఓట్లేసే వరకూ బీసీలకు నేనున్నాను, నేను విన్నానన్నాడు. గెలిచాక బీసీలపై వేటేస్తూ రిజర్వేషన్లపై రెడ్డి సంఘంతోనే కేసు వేయించిన జగన్‌రెడ్డి బీసీల ద్రోహి అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

అంతేకాదు, కొత్త‌గా మ‌రో వాద‌న‌ను కూడా తెర‌మీదికి తెచ్చారు. బీసీల‌కు రిజ‌ర్వేష‌న్ విష‌యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే సుప్రీం కోర్టుకు వెళ్లాల‌ని డిమాండ్ చేశారు. వెళ్ల‌పోతే.. బీసీల‌కు ద్రోహం చేసిన‌ట్టేన‌ని వ్యాఖ్య‌లు చేశారు. సో.. మొత్తానికి ఎన్నిక‌ల‌కు ముందుగానే బీసీల అంశం ర‌గ‌డ‌ను సృష్టించేసింది. మ‌రి ఇక‌పై ఎవ‌రి ఎత్తులు.. వారికి ఉండ‌నే ఉన్నాయి. మ‌రో ఎన్నిక‌ల కురుక్షేత్రాన్ని వీక్షించి త‌మ‌దైన శైలిలో తీర్పు చెప్ప‌డ‌మే ఇప్పుడు ప్ర‌జ‌ల‌కు మిగిలింది అంటున్నారు ప‌రిశీల‌కులు.

Read more RELATED
Recommended to you

Latest news