ఏపీలో అధికార వైసీపీలో మరో సీనియర్ నేత ఆవేదన చెందుతున్నారు. తనని సొంత పార్టీ వాళ్లే మోసం చేస్తున్నారని, తనని దెబ్బతీయాలని చూస్తున్నారని అంటున్నారు. దీంతో ఆయన వైసీపీకి దూరం అవుతారా? లేక ఇది ఏమైనా కోవర్టు ఆపరేషన్? అనే డౌట్ విశ్లేషకుల్లో వస్తుంది. ఎందుకంటే ఇటీవలే వైసీపీలో కీలకంగా ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ నుంచి బయటకొచ్చారు. అందులో జగన్‌కు వీర విధేయులైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు.
సరే వీరు బయటకొచ్చారు. కానీ జగన్ బంధువు..ముందు నుంచి వైఎస్ ఫ్యామిలీ విధేయుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సైతం పార్టీ నుంచి బయటకొచ్చే ప్రయత్నం జరుగుతుందనే అంశం పెద్ద చర్చగా మారింది. మంత్రి పదవి పోయిన దగ్గర నుంచి బాలినేని అసంతృప్తిగానే ఉన్నారు. అలాగే ఆయనకు పార్టీలో అనుకున్న మేర ప్రాధాన్యత దక్కడం లేదు. ఈ క్రమంలోనే ఆయన పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త పదవికి రాజీనామా చేశారు.
స్వయంగా జగన్ మాట్లాడి బుజ్జగించిన రాజీనామా వెనక్కి తీసుకోలేదు..పైగా ఇప్పుడు మీడియా సమావేశం పెట్టి..సొంత పార్టీ వాళ్ళే తనని అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలోని కొంత మంది అగ్ర నేతలే తనను టార్గెట్ చేశారని, వైసీపీని నాశనం చేసేందుకు కొందరు కంకణం కట్టుకున్నారని.. వారి వ్యవహారాలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు.
అసలు ఎక్కడ ఏది జరిగినా తనకే చుడుతున్నారని, హవాలా మంత్రి, భూకబ్జాలు, సినిమాల్లో పెట్టుబడులంటూ రకరకాలుగా అవినీతి ఆరోపణలు చేయడం దుర్మార్గంగా ఉందని, జిల్లాలోని కొందరు వైసీపీ ఇన్‌చార్జులు, ఎమ్మెల్యేలతో సీఎంకు తనపై ఫిర్యాదులు చేయిస్తున్నారని.. అవి ఎవరు చేయిస్తున్నారో అందరికి తెలుసని అన్నారు.
అంటే సొంత వాళ్లే బాలినేని బద్నామ్ చేస్తున్నారని అంటున్నారు. అయితే ఈ పరిస్తితుల్లో బాలినేని పార్టీ మారతారని చెబుతున్నారు..కానీ ఆయన వైసీపీలోనే ఉంటానని అంటున్నారు. ఇందులో ఏది జరుగుతుందో క్లారిటీ లేదు. ఒకవేళ ఆయన పార్టీ మారి..టిడిపి లేదా జనసేనలోకి వెళితే..ఇదేదో వైసీపీ చేస్తున్న కోవర్టు ఆపరేషన్‌గా భావించవచ్చు అని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే జగన్ సన్నిహితంగా బాలినేనిని వదులుకోవడం అనేది జరగని పని అని, కానీ ఆయన్ని వాదులుకుంటున్నారు అంటే ఏదో స్కెచ్ ఉంటుందని అంటున్నారు. ఒకవేళ పార్టీలో కొనసాగితే కథ వేరే ఉంటుందని చెబుతున్నారు. చూడాలి మరి రానున్న రోజుల్లో బాలినేని ఏం చేస్తారో.