ఎన్టీఆర్ ఓడిన స్థానంలో కారు మళ్ళీ గెలుస్తుందా?

-

తెలుగు రాజకీయాల్లో తనదైన ముద్రవేసి..ప్రపంచ స్థాయిలో తెలుగువాడికి ఓ గుర్తింపు తెచ్చిన దివంగత ఎన్టీఆర్ సైతం ఒకసారి ఓడిపోయిన విషయం తెలిసిందే. రాజకీయాల్లో గెలుపోటములు ఎవరికి అతీతం కాదని రుజువు చేసింది. అయితే టి‌డి‌పి ద్వారా తిరుగులేని నాయకుడుగా 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్…1989 ఎన్నికలు ఓ పీడకల..అప్పుడు టి‌డి‌పి ఓడిపోవడంతో పాటు ఎన్టీఆర్ ఓడిపోయారు.

1989లో కల్వకుర్తి నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోయారు. కాకపోతే అప్పుడు రెండోస్థానం హిందూపురంలో పోటీ చేసి గెలిచారు. అయితే కల్వకుర్తిలో ఓడటం ఎన్టీఆర్‌కు పెద్ద షాక్..కాంగ్రెస్ చేతులో ఆయన ఓడిపోయారు. అలా ఎన్టీఆర్ ఓడిన చోట ఇప్పుడు రాజకీయం వాడివేడిగా సాగుతుంది. ఇక్కడ ట్రైయాంగిల్ ఫైట్ జరిగేలా ఉంది. గత ఎన్నికల్లో అక్కడ ట్రైయాంగిల్ ఫైట్ జరిగింది. బి‌ఆర్‌ఎస్, బి‌జే‌పి, కాంగ్రెస్ మధ్య పోరు జరిగింది.

ఈ పోరులో బి‌ఆర్‌ఎస్ నుంచి గుర్క జైపాల్ యాదవ్ గెలిచారు. బి‌జే‌పి రెండోస్థానంలో, కాంగ్రెస్ మూడోస్థానంలో నిలిచింది. అయితే గతంలో జైపాల్ టి‌డి‌పి నుంచి రెండుసార్లు గెలిచారు. ఇక ఇప్పుడు ఎమ్మెల్యేగా జైపాల్ అనుకున్న విధంగా సక్సెస్ అవ్వడంలో వెనుకబడి ఉన్నట్లు తెలుస్తుంది. గత ఎన్నికల్లోనే 3 వేల ఓట్ల తేడాతో గెలిచారు. ఈ సారి ఆయనకు టఫ్ ఫైట్ ఎదురుకానుంది. ఇక్కడ బి‌జే‌పి, కాంగ్రెస్ బలంగానే ఉన్నాయి.

బి‌జే‌పి నుంచి మళ్ళీ ఆచారి తాల్లోజు పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఇక కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచందర్ రెడ్డి ఉన్నారు. కానీ ఇటీవలే ఐక్యత ఫౌండేషన్ ఛైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చారు. నియోజకవర్గంలో సుంకిరెడ్డికి కూడా ఫాలోయింగ్ ఉంది. సేవా కార్యక్రమాలతో ప్రజల్ని తన వైపు తిప్పుకుంటున్నారు.

దీంతో కాంగ్రెస్ లో సీటు పంచాయితీ నడుస్తుంది. అయితే చల్లాకే సీటు దక్కే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. కానీ ఏదేమైనా కల్వకుర్తిలో త్రిముఖ పోరు జరగనుంది. అయితే బి‌జే‌పి, కాంగ్రెస్ పార్టీల మధ్య భారీగా ఓట్లు చీలితే మళ్ళీ కారుకే బెనిఫిట్. చూడాలి మళ్ళీ కల్వకుర్తిలో కారు గెలుస్తుందో లేదో.

Read more RELATED
Recommended to you

Latest news