అధికార బిఆర్‌ఎస్ పార్టీ మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్‌తో ఎన్నికల బరిలో దిగాలని చూస్తుందా? 2014, 2018 ఎన్నికల మాదిరిగానే ఈ సారి కూడా సెంటిమెంట్ రాజేసి ఎన్నికల్లో లబ్దిపొందాలని అనుకుంటుందా? అంటే కాంగ్రెస్ అనుకూల వర్గాలు అవుననే చెబుతున్నాయి. 2014 ఎన్నికల్లో అప్పుడే తెలంగాణ రావడంతో..ప్రజలంతా కేసిఆర్ తెలంగాణ సాధించారని అప్పుడు ఆయనకు మద్ధతు తెలిపారు.
ఇక 2018 ఎన్నికల్లో అప్పటివరకు కేసిఆర్ పాలన బట్టి ఓట్లు వేయాల్సి ఉంది. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ పెద్ద తప్పు చేసింది..అది ఏంటంటే టిడిపి పొత్తు పెట్టుకోవడం..దీంతో తెలంగాణలో మళ్ళీ చంద్రబాబు పెత్తనం చేస్తారని, ఆంధ్రా వాళ్ళ చేతుల్లోకి అధికారం వెళుతుందని కేసిఆర్ ప్రచారం చేశారు. ఇది ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీకి కలిసొచ్చింది.ప్రజలు వన్ సైడ్ గా కేసిఆర్ వైపు నిలిచారు. దీంతో మళ్ళీ అధికారంలోకి వచ్చారు. అయితే అన్నిసార్లు తెలంగాణ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వడం కష్టం. కానీ ఈ సారి వేరే రూపంలో సెంటిమెంట్ లేపడానికి బిఆర్‌ఎస్ ప్రయత్నిస్తుందని తెలుస్తోంది.
తాజాగా మంత్రి కేటిఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్, బిజేపిలని నడిపించేది ఆంధ్రా వాళ్ళు అని అంటున్నారు. మొన్నటివరకు టిపిసిసి అధ్యక్షుడు వెనుక చంద్రబాబు ఉన్నారని మాట్లాడారు. ఇప్పుడు కేవిపి రామచంద్రరరావు ఉన్నారని అంటున్నారు. అటు కిషన్ రెడ్డి వెనుక కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారని చెబుతున్నారు.
అంటే ఇలా ఆంధ్రా వాళ్ళు తెలంగాణలో రాజకీయం నడిపిస్తున్నారని కేటిఆర్ కామెంట్ చేశారు. అలాగే తెలంగాణ సోనియా గాంధీ ఇవ్వలేదని, కేసిఆర్ పొరాడి సాధించారని, చివరికి ఏం చేయలేక సోనియా తెలంగాణ ఇచ్చారని కేటిఆర్ చెబుతున్నారు. ఇలా పూర్తిగా తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ తెరపైకి వచ్చింది.
దీంతో ఈ సారి బిఆర్‌ఎస్ సెంటిమెంట్ రాజకీయాలకు కాంగ్రెస్ విరుగుడు మంత్రంతో వస్తుంది. సోనియా వల్లే తెలంగాణ వచ్చిందని గతంలో అసెంబ్లీలో కేసిఆర్ చెప్పిన మాటలని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. అసలు కాంగ్రెస్ లేకపోతే కేసిఆర్‌కు అధికారం ఎక్కడది అని అంటున్నారు. అటు కాంగ్రెస్..తెలంగాణ చేతుల్లోనే ఉందని..అందులో డౌట్ లేదని, ఆంధ్రా వాళ్ళు అంటూ సెంటిమెంట్ రేపుతున్న కేటిఆర్..బిఆర్‌ఎస్ పార్టీని ఏపీలో ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి బిఆర్‌ఎస్ సెంటిమెంట్‌కు కాంగ్రెస్ బ్రేకులు వేయాలని చూస్తుంది.