తెలంగాణలో బీజేపీ బలపడుతుందనే సంకేతాలు మొదలైంది..దుబ్బాక ఉపఎన్నికలో విజయం ద్వారా అని చెప్పవచ్చు. 2018 ఎన్నికల్లో బీజేపీ దారుణంగా ఓడిపోయి కేవలం ఒక సీటు మాత్రమే గెలుచుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత 2019 పార్లమెంట్ ఎన్నికలో బిజేపి నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకుంది. కాకపోతే ఆ విజయం మోదీ వేవ్ లో దక్కిందని అంతా అనుకున్నారు.
కానీ 2020లో దుబ్బాక ఉపఎన్నిక వచ్చింది. ఆ ఉపఎన్నిక బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణించడంతో వచ్చింది. అయితే బిఆర్‌ఎస్ అధికారంలో ఉంది, పైగా ఎమ్మెల్యే చనిపోయిన సానుభూతి ఉంది. అటు ఎమ్మెల్యే భార్య సుజాత రెడ్డి బిఆర్‌ఎస్ నుంచి బరిలో దిగారు..దీంతో దుబ్బాకలో బిఆర్‌ఎస్ విజయం లాంఛనమే అని అంతా అనుకున్నారు. కానీ వరుసగా రెండుసార్లు ఓడిపోతూ వచ్చిన బిజేపి నేత రఘునందన్ రావుకు అనూహ్యంగా దుబ్బాక ఉపఎన్నిక కలిసొచ్చింది. చివరి రౌండ్ వరకు ఉత్కంఠ జరిగిన దుబ్బాక ఉపఎన్నికలో బిజేపి నుంచి రఘునందరావు గెలిచారు. దాదాపు వెయ్యి ఓట్ల తేడాతో ఆయన గెలిచారు.
అయితే రఘునందన్ గెలుపుపై బిఆర్‌ఎస్ నేతలు సెటైర్లు వేస్తూనే వస్తున్నారు. ఏదో అదృష్టం కొద్ది తక్కువ మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యే అయ్యారని అంటూనే ఉన్నారు. దీంతో రఘునందన్ వచ్చే ఎన్నికల్లో తన సత్తా ఏంటో చూపిస్తానని బిఆర్‌ఎస్ నేతలకు సవాల్ విసురుతున్నారు. మరి ఈ సారి ఎన్నికల్లో కూడా దుబ్బాకలో రఘునందన్ సత్తా చాటగలరా? అంటే ఇప్పుడే చెప్పలేని పరిస్తితి.
దుబ్బాకలో కాంగ్రెస్ రేసులో వెనుకబడింది గాని..ఆ పార్టీ పుంజుకుంటే బిజేపికి రిస్క్. ఈ సారి దుబ్బాక లో బిఆర్‌ఎస్ నుంచి బలమైన నేతని బరిలో దింపాలని బిఆర్‌ఎస్ చూస్తుంది. కాకపోతే రాష్ట్రంలో బిజేపి బలపడటం రఘునందన్‌కు కలిసి రావచ్చు. రఘునందన్ గట్టిగా కష్టపడితే మళ్ళీ దుబ్బాకలో సత్తా చాటవచ్చు. కాకపోతే ఈ సారి మాత్రం అదృష్టం కొద్ది గెలవడం కష్టమనే చెప్పాలి.