రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం చాలా కష్టం. నిన్నటి వరకు భుజం భుజం రాసుకుని న డిచిన నాయకులు రేపు శత్రువులు కావొచ్చు. నిన్నటి వరకు దుర్భాషలాడుకున్న నాయకులు మిత్రులుగా కలిసి అడుగులు వేయనూ వచ్చు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు అంటూ ఎవరూ ఉం డరు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నాయకులే నేటి రాజకీయాల్లో ఉన్నారనేది వాస్తవం. ఇక, ఇప్పుడు ఏపీ, తెలంగాణలోనూ రాజకీయాలు వేడెక్కాయి. నిన్నటి వరకు మిత్రులుగా ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్, ఏసీ సీఎం జగన్‌లు.. కలిసి భోజనం చేశారు. ఒకరింటికి ఒకరు వచ్చారు. కలిసి మాట్లాడుకున్నారు.
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కలిసి ముందుకు సాగాలని నిర్ణయాలు తీసుకున్నారు. కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. దీంతో ఇంకేముంది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఊహించని పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయమని అందరూ అనుకున్నారు. నిజానికి ఈ పరిణామం.. రెండు రాష్ట్రాల్లోని విపక్షాలకు అసూయ కూడా పుట్టించింది. వీరు ఎంత దూరం కలిసి ప్రయాణం చేస్తారోచూస్తాం- అంటూ చంద్రబాబు వంటి వారు ప్రకటనలు కూడా గుప్పించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే నిజమవుతున్నాయా? అనే పరిస్థితి కనిపిస్తోంది.
ఏపీ సీఎం జగన్ వేస్తున్న అడుగులు కేసీఆర్‌ను దూరం చేసుకునే దిశగానే సాగుతున్నాయని అంటున్నారు. ప్రస్తుతం జగన్ మనసంతా ఎన్డీయే పైనే ఉంది. వ్యక్తిగత లబ్ధి కావొచ్చు.. రాష్ట్ర ప్రయోజనాలు కొవొచ్చు.. ఏదేమైనా ఆయన ఎన్డీయేతో మిత్రత్వానికి సిద్ధమవుతున్నారన్న సంకేతాలు వస్తున్నాయి. అంతేకాదు, కేంద్ర కేబినెట్‌లోనూ జగన్ కోసం ఓ సీటును ఖాళీ చేసి ఇచ్చేందుకు మోడీ సిద్ధమయ్యారని సమాచారం ఇదే జరిగితే..కేసీఆర్‌కు జగన్‌కు మధ్య బంధం సన్నగిల్లడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.
ఆది నుంచి కూడా ఎన్డీయేతో కేసీఆర్ విభేదిస్తున్నారు. తానే స్వయంగా తృతీయ ప్రత్యామ్నాయం తీసుకువస్తానని ప్రకటించారు. ఇటీవల ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్నార్సీ, సీఏఏలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ పరిణామాలతో బీజేపీతో చెలిమి చేసే పార్టీలకు తాను వ్యతిరేకమన్నది కేసీఆర్ చెప్పకనే చెప్పారు. మరి ఇప్పుడు జగన్ వెళ్లి వెళ్లి బీజేపీతో చెలిమి చేస్తే.. ఆయన జగన్‌కు దూరం కావడం తథ్యమని అంటున్నారు., ఇది రాష్ట్ర ప్రయోజనాలపై ఏవిధంగా ప్రభావం చూపిస్తుందో చూడాలి.